News February 27, 2026
అంగన్వాడీ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం: సీతక్క

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి చిన్నారికి 100 ml పాలను అందిస్తున్నామని, రక్తహీనత తగ్గించేందుకు చిరు ధాన్యాల చిక్కీలు ఇస్తున్నామన్నారు. అమ్మ మాట.. అంగన్వాడీ బాట ఫలితంగా చిన్నారుల నమోదు పెరిగిందన్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
Similar News
News April 19, 2026
ట్రంప్-మునీర్ మైత్రి: అమెరికాకే ప్రమాదం!

ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఎంచుకోవడాన్ని అమెరికా రక్షణ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇరాన్ సైన్యం, నిఘా సంస్థలు, IRGC నేతలతో ఆయనకు ఏళ్ల నుంచి ఉన్న సంబంధాలే ఇందుకు కారణం. గతంలో అఫ్గాన్ విషయంలో మిత్రదేశంగా నటిస్తూనే తాలిబన్లకు సహకరించిన పాక్ ద్వంద్వ నీతిని మరువరాదని, మునీర్‌ను నమ్మడం వల్ల US వ్యూహాత్మక రహస్యాలు ఇరాన్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
News April 19, 2026
కీవ్ సూపర్ మార్కెట్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి!

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌లోని హోలోసివ్స్కీ జిల్లాలో వీధిలో వెళ్తున్న వారిపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం సూపర్ మార్కెట్‌లోకి దూరి కొంతమందిని బందీలను చేసుకున్నాడు. సుమారు 40 నిమిషాల ఉత్కంఠ తర్వాత ప్రత్యేక దళాలు (KORD) జరిపిన ఆపరేషన్‌లో నలుగురు బందీలను విడిపించారు. దుండగుణ్ని కాల్చి చంపారు.
News April 19, 2026
రామగుండం: రక్తమోడుతున్న రోడ్లు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు బలి

రామగుండం ప్రాంతంలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 4న సింగరేణి ఉద్యోగి శ్రీధర్, 7న ఆటో డ్రైవర్ ఇస్మాయిల్, 10న గంగారపు కిష్టయ్య రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ప్రైవేట్ టీచర్ మేరుగు వెన్నెల, తిరునహరి సంతోష్ కుమార్ మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలోనే ఐదుగురు మృత్యువాత పడటంతో రోడ్డు ప్రమాదాలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


