News February 12, 2026
ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ‘కెమ్ డ్రా’ కోర్సు ప్రారంభం

ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కెమ్ డ్రా’ సర్టిఫికెట్ కోర్సును బుధవారం ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా ప్రారంభించారు. రసాయన పదార్థాల నిర్మాణాలు, వాటి పేర్లను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ సాఫ్ట్‌వేర్ కోర్సు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కెమిస్ట్రీపై పట్టు సాధించేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు.
Similar News
News March 10, 2026
ఖమ్మం జిల్లాలో తొలి ‘కుసుమ్’ సోలార్ ప్లాంట్ ప్రారంభం

తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో ప్రధానమంత్రి కుసుమ్ (PM-KUSUM) పథకం కింద ఏర్పాటు చేసిన 2 మెగావాట్స్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను మంగళవారం ప్రారంభించారు. రైతు బీరవల్లి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. జిల్లాలో ఈ పథకం కింద ప్రారంభమైన తొలి సోలార్ ప్లాంట్ ఇదే. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News March 10, 2026
ఖమ్మం: ఇంటర్ పరీక్షలో విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఓ విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని ఓ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డీఐఈఓ రవిబాబు వెల్లడించారు. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,849 మంది హాజరుకాగా, 502 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News March 10, 2026
ఖమ్మం: చెక్కు బౌన్స్.. నిందితుడికి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో శ్రీరాంనగర్‌కు చెందిన జి.విద్యాసాగర్‌కు ఖమ్మం కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2017లో బానోత్ శరత్ వద్ద తీసుకున్న రూ.2 లక్షల అప్పు కోసం విద్యాసాగర్ ఇచ్చిన చెక్కు తిరస్కరణకు గురైంది. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయాధికారి బెక్కమ్ రజని నిందితుడికి 3 నెలల జైలు శిక్షతో పాటు, బాధితుడికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పునిచ్చారు.


