News March 21, 2025
మచిలీపట్నం: చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య

మచిలీపట్నం చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన విర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీను నివాసంలోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన ఘటన స్థలిలోనే మృతిచెందారు. పోలీసులు హత్యాస్థలానికి చేరుకొని మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 23, 2025
కృష్ణా జిల్లాను ముంచెత్తిన వాన

కృష్ణా జిల్లాను వర్షం ముంచెత్తింది. మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, బంటుమిల్లి, ఉయ్యూరు తదిరత ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. అత్యధికంగా మచిలీపట్నంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నాగాయలంకలో 7.6, బంటుమిల్లిలో 5.6, ఘంటసాలలో 5.4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 1-5 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వరితో పాటు ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి.
News October 23, 2025
కృష్ణా: పొలాలపై వరుణుడి ఎఫెక్ట్

జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కంకి దశకు చేరిన వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు విరుచుకుపడడంతో నష్టపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే పంటలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
News October 23, 2025
కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబర్ 08672-252572 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా 24/7 సహాయచర్యలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.