News November 10, 2025
అశువు కవిత్వంలో ఆయనకు ఆయనే సాటి

ప్రముఖ కవి, రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు. చిన్నతనంలో గొర్రెల కాపరిగా, కూలీగా పనిచేసిన ఆయన.. పట్టుదలతో చదివి రచయితగా ఎదిగారు. అశువు కవిత్వం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. తన పాటలతో తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన సినీ రంగానికి రచయితగా సేవలందించారు.
Similar News
News November 10, 2025
వరంగల్ ప్రాముఖ్యతను వివరించిన అందెశ్రీ

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పేరుగాంచిన పల్లెలను కీర్తిస్తూ అందెశ్రీ రచించిన ‘గలగల గలగల గజ్జెలబండి ఘల్లు చూడు.. ఓరుగల్లు చూడు’ అనే పాట ఆయన లేడని ఘోల్లుమంటోంది. ‘కాకతీయులు ఏలిన ఖిల్లా వరంగల్, వేయిస్తంభాల గుడి, పెంబర్తి హస్తకళలు, రజాకార్లను తరిమికొట్టిన మద్దూరు మండలంలోని వీరబైరాన్ పల్లినీ, జాతీయ విప్లవకారులనుగన్న జాగోరే జనగామను చూడు’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాముఖ్యతను ఈ పాటలో చాటి చెప్పారు.
News November 10, 2025
అందెశ్రీకి కోదాడతో విడదీయరాని బంధం

రచయిత అందెశ్రీ మృతి పట్ల కోదాడ ‘తెర’ సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కోదాడ, ‘తెర’తో అందెశ్రీకి విడదీయరాని బంధం ఉందన్నారు. ఇటీవల దశాబ్ధి వేడుకల్లో ఆయన పాల్గొని ఆట, పాటను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. “జై బోలో తెలంగాణ” పాట నిప్పులవాగై ప్రవహించిందని, “చూడ చక్కనితల్లి”, “కొమ్మ చెక్కితే బొమ్మరా” పాటలు సజీవమని కొనియాడారు.
News November 10, 2025
ప్రారంభమైన మార్కెట్.. తగ్గిన పత్తి ధర

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,800 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం గరిష్టంగా పత్తి ధర రూ. 6,950 పలకగా.. నేడు భారీగా పడిపోయింది. దీంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.


