News April 22, 2025
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్‌ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 22, 2025
NLG: 20 దేశాలకు మన తాటి ముంజలు!

వేసవి వచ్చిందంటే చాలు తాటి ముంజలకు గిరాకీ పెరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పలువురు తాటి ముంజలను NLGకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. డజన్ రూ.70 వరకు అమ్ముతున్నట్లు తెలిపారు. NLG జిల్లాకు చెందిన మువ్వ రమేశ్ అనే యువ పారిశ్రామికవేత్త వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులోని తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ ద్వారా 20 దేశాలకు తాటి ముంజలు ఎగుమతి చేస్తున్నారు.
News April 22, 2025
NLG: టార్పాలిన్లు లేక రైతన్నల పాట్లు

ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పథకం రద్దు కావడంతో నానా పాట్లు పడుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
News April 22, 2025
భూ సమస్యలు తీర్చేందుకే భూ భారతి: కలెక్టర్ ఇలా

రైతుల భూ సమస్యలు తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం-2025 తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం ఆమె గుండ్లపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు తెలంగాణ భూ భారతిపై అవగాహన కల్పించారు. భూ భారతిలో భూములకు సంబంధించి సవరణలు చేసే అవకాశం ఉందన్నారు.