News June 14, 2024
తూ.గో.: రేపటి నుంచి వేట షురూ

చేపల సంతానోత్పత్తి, మత్స్య సంపద వృద్ధి లక్ష్యంగా సముద్రంలో 2 నెలల పాటు అమలుచేసిన చేపల వేట నిషేధం శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో శనివారం నుంచి వేట షురూ కానుంది. ఏప్రిల్ 14 నుంచి వేట నిషేధం ప్రకటించారు. కాకినాడ జిల్లాలో తొండంగి నుంచి తాళ్ళరేవు వరకు 94 కిలోమీటర్ల మేర సాగర తీరం విస్తరించి ఉంది. జిల్లాలో 1,95,184 మంది మత్స్యకారుల్లో 36,101 మంది సముద్రంలో వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు.
Similar News
News October 30, 2025
నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

నవంబర్ 7న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
News October 30, 2025
గోకవరం: ముంపు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్

గోకవరం మండలంలోని ముంపునకు గురైన కృష్ణుని పాలెం, సంజీవయ్య నగర్ కాలనీల మధ్య ప్రాంతాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం సందర్శించారు. ముంపు వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణుని పాలెం, సంజీవయ్య నగర్ మధ్య ఉన్న ఊర కాలువ వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పాల్గొన్నారు.
News October 30, 2025
ఉద్యాన రైతును దెబ్బ కొట్టిన మొంథా తుఫాన్

జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో 1,860 మంది రైతులకు చెందిన 2738.73 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన అధికారి మల్లికార్జునరావు తెలిపారు.170.33 ఎకరాల్లో కూరగాయ పంటలు,62.19 ఎకరాల్లో బొప్పాయి, రెండున్నర ఎకరాల్లో పూల తోటలు,5.92 జామ, 2491 అరటి, రెండున్నర ఎకరాల్లో తమలపాకు, 3.35 ఎకరాల్లో పచ్చిమిర్చి పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు.


