News April 5, 2025
INC, BRS దూరం.. రసవత్తరంగా MLC ఎన్నిక

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయించాయి. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ రసవత్తరంగా జరగనుంది. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్‌రావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గతంగా ఎవరికి మద్దతు ఇస్తాయనేదానిపైనా ఆసక్తి నెలకొంది. కాగా ఈనెల 23న పోలింగ్ జరగనుండగా 112 మంది ఓటు వేయనున్నారు.
Similar News
News April 9, 2025
అకాల వర్షాలు.. రైతులకు తీవ్ర నష్టం

AP: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగులుస్తున్నాయి. కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల, బాపట్ల, ప్రకాశం, అల్లూరి జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. 10వేల ఎకరాల వరి, 3వేల ఎకరాల మొక్కజొన్న, 670 ఎకరాల్లో అరటి, బొప్పాయి, నిమ్మ తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా నష్ట తీవ్రత పెరుగుతోందంటున్నారు.
News April 9, 2025
బీమా కంపెనీలకు సుప్రీం కీలక ఆదేశాలు

ఆచరణసాధ్యం కాని షరతులు విధించి క్లెయిమ్స్‌ను ఎగవేయడం సరికాదని బీమా కంపెనీలకు సుప్రీం కోర్టు చురకలంటించింది. షరతుల్ని పాటించలేదన్న పేరుతో బీమా చెల్లింపుల్ని తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. బీమా కంపెనీలు నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొంది. సోహోం షిప్పింగ్ సంస్థకు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థకు మధ్య నడుస్తున్న కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈమేరకు తీర్పునిచ్చింది.
News April 9, 2025
11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు

AP: సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా ఈ నెల 11న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. ఆ రోజున సాయంత్రం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఒంటిమిట్టకు వెళతారు. కోదండరామ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.