News August 23, 2025
29న విశాఖకు రానున్న సీఎం చంద్రబాబు

ఈ నెల 29న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా హోటల్ నోవాటెల్‌కు వెళ్తారు. అనంతరం V.M.R.D.A కాంప్లెక్స్‌లు, పర్యాటక శాఖ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభిస్తారు. అమరావతి ఛాంపియన్షిప్ కప్ ఫైనల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసి తర్వాత ప్రో కబడ్డీ పోటీలను ప్రారంభిస్తారని జిల్లా అధికారులు శనివారం తెలిపారు.
Similar News
News August 24, 2025
విశాఖలో ఉదయాన్నే యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

విశాఖలో ఆదివారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గంట్యాడ నుంచి గంగవరానికి వెళ్లే దారిలో కొంగపాలెం జంక్షన్ వద్ద నడిచి వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న న్యూ పోర్టు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 24, 2025
‘కార్పొరేటర్ల భద్రతను పట్టించుకోని జీవీఎంసీ’

జీవీఎంసీ ప్రతి ఏటా కార్పొరేటర్ల కోసం స్టడీ టూర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భద్రత విషయంలో గాలికి వదిలేస్తుందని 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నాలుగుసార్లు స్టడీ టూర్ ఏర్పాటు చేయగా ప్రతిటూర్‌లో అవకతవకలు, ఇబ్బందులు జరిగాయన్నారు. తిరిగి పాత ట్రావెల్స్ నిర్వహించిన వ్యక్తికే ఈసారి కూడా స్టడీ టూర్ అప్పగిస్తున్నారని భద్రతను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు.
News August 24, 2025
విశాఖలో పోలీసులకు రివార్డులు

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 122 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.