News August 31, 2025
కలగా మిగిలిన వంశధార-బాహుదా నదుల అనుసంధానం

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగిలింది. గొట్టాబ్యారేజీ నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. వంశధార నది నుంచి సుమారు 97,262 టీఎంసీలు బాహుదాకు మళ్లించాలని గతంలో TDP ప్రభుత్వ హయాంలో సంకల్పించారు. ఈ రెండు నదులు అనుసంధానం చేస్తే ఎనిమిది మండలాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం స్పందించి వంశధార, బాహుదా నదుల అనుసంధానం వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News September 3, 2025
నిమజ్జనాల్లో డీజేలకు అనుమతులు లేవు: SP

శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమర్జన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలను వినియోగించేందుకు అనుమతులు లేవన్నారు.
News September 3, 2025
చింతపండుకి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న గిరిజనులు

శ్రీకాకుళంలోని ఏజెన్సీ ప్రాంతాలలో చింతపండు సేకరించే గిరిజనులు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన కార్పొరేషన్ నుంచి గిట్టుబాటు ధర లభించక దళారీల దోపిడీకి గురవుతున్నారు. ఈ ఏడాది ఏజెన్సీలో మంచు ఎక్కువగా కురవటంతో చింతపండు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు గిట్టుబాటు ధర చెల్లించకపోవటంతో దళారీలకే చింతపండు తక్కువ ధరకు ఇచ్చేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.
News September 3, 2025
అరసవిల్లి సూర్య దేవాలయం మూసివేత

అరసవిల్లి ఆదిత్య ఆలయాన్ని ఈ నెల 7న భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు.