News September 2, 2025
టీచర్లు టెట్ పాస్ అయితేనే..: సుప్రీంకోర్టు

ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్లు సర్వీసు ఉన్నవారంతా టెట్ పాస్ కావాల్సిందేనని తెలిపింది. ఇందుకోసం రెండేళ్ల గడువు విధించింది. ఆ లోపు అర్హత సాధించని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా ఉమ్మడి ఏపీలో 2012లో తొలిసారి టెట్ నిర్వహించారు. అంతకుముందు ఉద్యోగంలో చేరిన 30వేల మందిపై ప్రభావం పడనుంది.
Similar News
News September 2, 2025
జియో, ఎయిర్‌టెల్.. మీకూ ఇలా అవుతోందా?

జియో, ఎయిర్‌టెల్ సిగ్నల్స్ రాక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఒకప్పటి రోజులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇంట్లో ఏదో ఒకచోటే సిగ్నల్ ఉండటం, అక్కడే నిలబడి ఫోన్ వాడటం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వీడియోలేమో ‘లోడింగ్.. లోడింగ్’ అంటున్నాయి. గ్రామాలను పక్కనపెడితే హైదరాబాద్ వంటి నగరాల్లోనూ నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఫోన్లు కలవడం లేదని చాలామంది వాపోతున్నారు. మీరేమంటారు?
News September 2, 2025
టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు

AP: విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వైజాగ్‌కు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటుకు అనుగుణమైన పాలసీని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
News September 2, 2025
అఫ్గాన్ భూకంపం.. 1,400 మందికిపైగా మృతి

అఫ్గానిస్థాన్‌లో సంభవించిన <<17587630>>భూకంప ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 1,411 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 3,124 మంది గాయపడ్డారని, 5,412 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత కునార్ ప్రావిన్సులోని ఆసదాబాద్, నుర్గల్, ఛౌకే, వాటాపూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.