News September 23, 2025
డిగ్రీ కాలేజీల బంద్ కొనసాగుతుంది: ప్రైవేటు యాజమాన్యాల అసోసియేషన్

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనందుకు నిరసనగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా 70% కాలేజీలు మూసివేసినట్లు ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 27వరకు కాలేజీల బంద్ కొనసాగుతుందని ప్రకటించింది. OCT 6నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని వెల్లడించింది. గత 16 నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొంది.
Similar News
News September 23, 2025
వారికీ తల్లికి వందనం నిధులు విడుదల చేస్తాం: మంత్రి లోకేశ్

AP: తల్లికి వందనం కింద 66,57,508 మంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున సాయం అందించినట్లు మంత్రి లోకేశ్ మండలిలో తెలిపారు. ఇంకా అర్హులుంటే తప్పకుండా వర్తింపజేస్తామన్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు తర్వాత, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరినవారికి వెరిఫికేషన్ అనంతరం జమ చేస్తామని చెప్పారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా పథకం వర్తింపు విషయాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
News September 23, 2025
‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’తో బెండ పంటకు తీవ్ర నష్టం

బెండ పంటను ఆశించే చీడపీడల్లో ‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’ ప్రధానమైనది. ఈ వైరస్ ఉద్ధృతి పెరిగితే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొజాయిక్ వైరస్ సోకిన మొక్కల ఆకులపై పసుపుపచ్చని మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఆకుల ఆకారం మారుతుంది. కాండంపై మచ్చలు కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల, కాయల నాణ్యత తగ్గుతుంది. ఈ వైరస్ ఒక మెుక్క నుంచి ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.
News September 23, 2025
బెండలో మొజాయిక్ వైరస్‌ను ఎలా నివారించాలి?

బెండ తోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తికి తెల్లదోమ ప్రధాన కారణం. పంటలో ఈ దోమ ఉద్ధృతిని గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. తెల్లదోమ నివారణకు లీటరు నీటిలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి వారం రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి. తోటలో కోతకు వచ్చిన బెండ కాయలను పురుగుమందుల పిచికారీకి ముందే కోసేయాలి. దీని వల్ల వాటిలో పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉంటాయి.