News October 2, 2025
ప్రజలకు భరోసా కల్పించేలా పోలీస్ శాఖ పనిచేయాలి: ఎస్పీ

ప్రజలకు భరోసా కల్పించే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. డీపీఓలో బుధవారం తెనాలి, సౌత్ పోలీస్ సబ్-డివిజన్ల పనితీరుపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. PS పరిధిలోని స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. నేరాల నియంత్రణ కోసం దృఢమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ముఖ్యంగా రౌడీషీటర్లపై నిఘా పెంచాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో తెనాలి DSP జనార్థన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 2, 2025
GNT: గాంధీజీ రెండుసార్లు వచ్చిన ప్రదేశం..!

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో వినయాశ్రమం ఉంది. ఈ ఆశ్రమం మహాత్మాగాంధీజీ చేతులమీదుగా 1933 డిసెంబరు 23 తేదీన ప్రారంభమైనది. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ హరిజన యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ కల్లూరి చంద్రమౌళి వినతి మేరకు వినయాశ్రమంలో 2రోజులు గడిపారు. ఆనాడు ఆయన నాటిన రావి మొక్క నేడు మహావృక్షమైనది. రెండవసారి 1937 జనవరి 23న తుఫాను బాధితుల కోసం వచ్చారు.
News October 2, 2025
గుంటూరు జిల్లాలో ఆయనకి ఆలయాలు..!

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహం లేని ఊర్లు లేవంటే అతిశయోక్తి కాదు. అలాంటి గాంధీజీకి గుంటూరు జిల్లాలో 2 దేవాలయాలు ఉన్నాయి. తెనాలిలో మహాత్మా గాంధీ ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మహాత్మా గాంధీకి దేవాలయం నిర్మించి నిత్యం పూజలు చేస్తుంటారు. కాగా రామలింగాచారి తన సొంత ఇంటిని అమ్మి వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. నరసరావుపేటలో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది.
News October 2, 2025
గుంటూరు జిల్లాకి సాయం కోసం గాంధీజీ రోడ్ షో

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తుఫాను సహాయం కోసం జనవరి 23, 1937న విరాళాలు సేకరించాలని మహాత్మా గాంధీ రోడ్ షో నిర్వహించారు. వచ్చిన విరాళాలను బాధిత ప్రజల ఉపశమనం, పునరావాసం కోసం ఖర్చు చేశారు. ఆయన నిడబ్రోలు వద్ద రైలు దిగి దాదాపు 160 కి.మీ. రోడ్డు మార్గంలో ప్రయాణించారు. చిలకలూరిపేటలో ఆయనకు ఘన స్వాగతం లభించడమే కాక సహాయ నిధికి రూ.890 విరాళంగా ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం.