News December 30, 2025
మారనున్న తూర్పుగోదావరి రూపురేఖలు

కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఈ మూడు మండలాల ప్రజలు రాజమండ్రి ఆర్డీవో పరిధిలో సేవలు పొందనున్నారు. గత కొంతకాలంగా ఉన్న డిమాండ్ నెరవేరడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News January 21, 2026
ధవళేశ్వరంలో ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద నిర్మిస్తున్న పంపు హౌస్ స్లాబ్ నిర్మాణ పనులు చేపడుతుండగా ప్రమాదం సంభవించింది. స్లాబ్ వేస్తుండగా బుధవారం సెంట్రింగ్ కూలిపోయింది. దీంతో నిర్మాణపనులు చేస్తున్న కూలీల్లో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 20, 2026
22న రాజమండ్రిలో జాబ్ మేళా

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై, 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీలు ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 20, 2026
తూ.గో: వరకట్న వేధింపులు.. భర్తకు 18 నెలల జైలు శిక్ష

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయి కరిముల్లాకు 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ వీరరాఘవరావు మంగళవారం తీర్పునిచ్చారు. ధవళేశ్వరానికి చెందిన సయ్యద్ సమీన తబసుమ్‌ను అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో 2012లో రాజమహేంద్రవరం మహిళా పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది.


