News January 1, 2026
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నేతృత్వంలో విశాఖలో పోక్సో చట్టంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. పోక్సో కేసుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిందితుల్లో అధిక శాతం పరిచయస్తులే ఉంటున్నందున, తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలని కోరారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి పోలీసు, వైద్య శాఖల సహకారం కీలకమని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Similar News
News January 30, 2026
విశాఖ: డిప్యూటీ సీఎంను కలిసిన మత్స్యకారులు

బంగ్లాదేశ్ సముద్రజలాల్లో పొరపాటున ప్రవేశించిన విశాఖ మత్స్యకారులను అరెస్టు చేసి నిర్బంధించిన విషయం తెలిసిందే. వారిని విడిపించడంలో AP ప్రభుత్వం చూపించిన చొరవగాను మత్స్యకార మహిళలు, పెద్దలు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్‌ని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో మత్స్యకార మహిళలు కలిశారు. అనంతరం స్థానికంగా సమస్యలు వివరించారు. గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
News January 30, 2026
క్రిప్టో కరెన్సీ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: విశాఖ సీపీ

నగరంలో వెలుగుచూస్తున్న క్రిప్టో మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ సూచించారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్ లింకులతో మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధిక లాభాల ఆశచూపే ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ నమ్మవద్దని, వెబ్‌సైట్లలో స్పెల్లింగ్ తప్పులుంటే అవి ఫేక్ అని గుర్తించాలని కోరారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, మోసపోతే వెంటనే నం.1930 ఫిర్యాదు చేయాలని సూచించారు.
News January 30, 2026
విశాఖ: మీడియాపై ఆంక్షలు.. జీవీఎంసీ తీరుపై విపక్షాల ధ్వజం

జీవీఎంసీ సర్వసభ్య సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గీతం విద్యా సంస్థలకు చెందిన రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దొడ్డిదారిలో క్రమబద్ధీకరించేందుకే అధికార పక్షం ఈ కుట్ర పన్నిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీడియాను అడ్డుకుని, విపక్షాల గొంతు నొక్కి అక్రమ తీర్మానాలు చేయాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైకాపా నేతలు మండిపడుతున్నారు.


