News January 9, 2026
ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి..!

ఖమ్మం(D)లోని 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఈనెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల కానుండగా అనంతరం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఖరారుకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టనుంది. ఛైర్మన్ పదవులు, వార్డుల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సత్తుపల్లి, వైరా, మధిరతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.
Similar News
News January 23, 2026
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇంకా ప్రారంభం కాని ఈ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
News January 23, 2026
ఖమ్మంలింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్‌ఓ

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రామారావు హెచ్చరించారు. శుక్రవారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చట్టవిరుద్ధంగా పరీక్షలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నమోదు, రెన్యూవల్ కోసం వచ్చిన 24 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
News January 23, 2026
45 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించకుంటే రద్దు: కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు మంజూరైన 45 రోజుల్లోపు పునాది పనులు ప్రారంభించని పక్షంలో, ఆ మంజూరును రద్దు చేయాలని స్పష్టం చేశారు. రద్దయిన చోట కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు తీసుకోవాలని ఎంపీడీఓలు, తహశీల్దార్లకు సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించవద్దని, పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.


