News November 7, 2024
అగరబత్తి పొగ మంచిదేనా..?
చాలామంది భక్తులు పూజల్లో అగరబత్తుల్ని విపరీతంగా వెలిగిస్తుంటారు. కానీ ఆ పొగ అంత మంచిది కాదని అమెరికాకు చెందిన NIH పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అగరబత్తుల పొగ ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరించారు. ఒక అగరబత్తిని వెలిగిస్తే 45 మి.గ్రాముల కంటే ఎక్కువ కణాలు విడుదలవుతాయని, అవి సిగరెట్కంటే ఎక్కువని తెలిపారు. ఆ పొగలో ప్రమాదకరమైన పలు కర్బన సమ్మేళనాలు ఉంటాయని వివరించారు.
Similar News
News November 7, 2024
అగ్రరాజ్య అధ్యక్షుడికి సకల సౌకర్యాలు!
అమెరికా నూతన అధ్యక్షుడికి సకల సౌకర్యాలు లభిస్తాయి. ఆయనపై ఈగ వాలకుండా చూసుకునే సీక్రెట్ సర్వీస్ భద్రత ఉంటుంది. అధికారంలో ఉన్న నాలుగేళ్లు వైట్‌హౌస్‌కు అధిపతిగా ఉంటారు. ఇదే కాకుండా బ్లెయిర్ హౌస్, క్యాంప్ డేవిడ్ అనే మరో 2 గెస్ట్ హౌసుల్లో బస చేయొచ్చు. ఆయన విందుల కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు. ప్రయాణించడానికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్, బీస్ట్ కారు అందుబాటులో ఉంటాయి.
News November 7, 2024
మూసీ వరదపై మళ్లీ అధ్యయనం
TG: మూసీ నది గరిష్ఠ వరదపై ఐఐటీ హైదరాబాద్ సహకారంతో మళ్లీ అధ్యయనం చేపట్టనున్నారు. ఇటీవల హైడ్రాలజీ విభాగం మూసీ గరిష్ఠ వరద 1.5 లక్షల క్యూసెక్కులే అని నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారంతో పున:పరిశీలన చేయించిన తర్వాత నిర్ధారణకు రావాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే మూసీ నది సరిహద్దులు ఖరారు చేయాలని నిర్ణయించింది.
News November 7, 2024
స్కూల్ విద్యార్థులకు శుభవార్త
AP: 2025-26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ.953 కోట్లతో 1 నుంచి 10వ తరగతి చదివే 35 లక్షల మందికి కిట్లు ఇవ్వనుంది. ఈ కిట్‌లో బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫాం అందించనుంది. దీంతో పాటు యూనిఫాం కుట్టుకూలి కింద 1-8 క్లాసుల వారికి ₹120, 9,10 క్లాసుల వారికి ₹240 చెల్లించనుంది.