News September 24, 2025
అక్టోబర్ 1 నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు

వచ్చే నెల 1 నుంచి ఆధార్ సర్వీస్ ఛార్జీలు పెరగనున్నాయి. తప్పుల సవరణకు లేదా వివరాల అప్డేట్‌కు ప్రస్తుతం రూ.50 ఉండగా రూ.75కు, బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ.100 ఉండగా రూ.125కు పెంచుతున్నట్లు UIDIA తెలిపింది. పోర్టల్ ద్వారా నేరుగా పొందే సేవలకు ఛార్జీలను రూ.50 నుంచి రూ.75కు పెంచినట్లు పేర్కొంది. పోయిన ఆధార్ స్థానంలో కొత్తది కావాలంటే రూ.40 అప్లికేషన్ ఫీజు చెల్లించాలని వెల్లడించింది.
Similar News
News September 24, 2025
మరో అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఐదు రోజుల పాటు రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.
News September 24, 2025
ఏపీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం

AP: అసెంబ్లీలో 3 బిల్లుల(SC వర్గీకరణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సవరణ)కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును సభ ఆమోదించింది. దీని ప్రకారం గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన 12 కులాలకు 1%, గ్రూప్-2లోని 18 కులాలకు 6.5%, గ్రూప్-3లోని 29 కులాలకు 7.5% రిజర్వేషన్ అమలవనుంది. అలాగే నాలా ఫీజు స్థానిక సంస్థలకే దక్కే బిల్లూ ఆమోదం పొందింది.
News September 24, 2025
మార్కెట్లను వెంటాడుతున్న నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వెంటాడుతున్నాయి. ఇవాళ కూడా మార్కెట్లు రెడ్‌లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయాయి. కొన్ని కంపెనీలు మినహా అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగటివ్ సైన్, అమెరికా H1B వీసా నిబంధనలు ఈ నష్టాలకు కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.