News April 24, 2025

ఇది భారత్‌పై దాడి: ప్రధాని మోదీ

image

పహల్‌గామ్‌లో పర్యాటకులపై దాడిని భారత్‌పై దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని మోదీ గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆప్తులను కోల్పోయినవారికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.

News April 24, 2025

ఉపాధి హామీ.. ‘కూలీ’ అనే పదం వాడొద్దు: పవన్

image

AP: ఉపాధి హామీ పథకంలో 75లక్షల మందికి పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని అన్నారు. మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు.

News April 24, 2025

పాకిస్థానీ అంటూ ఆరోపణలు: స్పందించిన ప్రభాస్ హీరోయిన్

image

తాను పాకిస్థాన్ సంతతి యువతినంటూ వస్తున్న వార్తల్ని ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీ ఖండించారు. ‘నేను పాకిస్థానీ సైనికాధికారి కూతురినన్నది పచ్చిఅబద్ధం. ఆన్‌లైన్ ట్రోలర్లు ఆ విషయాన్ని వ్యాప్తి చేశారు. మా తల్లిదండ్రులు లాస్‌ఏంజిలిస్‌కు వలస వెళ్లారు. నేను అక్కడే పుట్టాను. హిందీ, తెలుగు, గుజరాత్, ఇంగ్లిష్ మాట్లాడే భారత సంతతి అమ్మాయిని నేను. ఈ బాధాకర సమయంలో ద్వేషాన్ని కాదు.. ప్రేమను వ్యాప్తి చేయండి’ అని కోరారు.

News April 24, 2025

నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా: రెహమాన్

image

తన విడాకుల సమయంలో ట్రోల్ చేసిన వారిపై ఎలాంటి కోపం లేదని, వారిని తన కుటుంబ సభ్యులుగానే భావిస్తానని AR రెహమాన్ అన్నారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానన్నారు. ఒకరిపై మనం చెడు ప్రచారం చేస్తే మన గురించి మరొకరు తప్పుగా చెబుతారని ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడినప్పుడు మనకూ ఓ కుటుంబం ఉందనే ఆలోచనతో ఉండాలని సూచించారు.

News April 24, 2025

1000 మంది మావోలు.. చుట్టుముడుతున్న బలగాలు!

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో సుమారు 1000మంది మావోలను 20వేలమంది భారత బలగాలు చుట్టుముడుతున్నట్లు సమాచారం. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద యాంటీ-నక్సల్ ఆపరేషన్‌గా కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు మావోయిస్టులకు చావు దెబ్బ తగలొచ్చని పేర్కొన్నాయి. ఇప్పటికే ఎన్‌కౌంటర్లో ఐదుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఖ్య భారీగా పెరగనుందని తెలుస్తోంది.

News April 24, 2025

కాంగ్రెస్ పాలనలో పల్లె కన్నీరు పెడుతోంది: కేటీఆర్

image

TG: KCR పాలనలో పదేళ్లపాటు మురిసిన పల్లె, నేడు కాంగ్రెస్ పాలనలో కన్నీరు పెడుతోందని KTR విమర్శించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా BRS పాలనలో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ పనులను గుర్తుచేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. ‘స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. గ్రామాల్లో కనీస వసతుల్లేవు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు’ అని ట్వీట్ చేశారు.

News April 24, 2025

చంద్రుడిపై చైనా, రష్యా అణు విద్యుత్ కేంద్రం!

image

చంద్రుడిపై అంతర్జాతీయ అణు విద్యుత్ కేంద్రాన్ని(ILRS) సంయుక్తంగా ప్రారంభించాలని చైనా, రష్యా ప్రణాళిక రచిస్తున్నాయి. ‘2028 కల్లా చంద్రుడిపై స్థావరానికి ఏర్పాట్లు మొదలుపెట్టాలని భావిస్తున్నాం. దానికి విద్యుత్‌ అందించేందుకు అణువిద్యుత్ కేంద్రం అవసరం. రోదసి ప్రయోగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న రష్యాతో కలిసి దాని నిర్మాణం కోసం పనిచేయాలని భావిస్తున్నాం’ అని చైనా పరిశోధకులు తెలిపారు.

News April 24, 2025

ఉగ్రదాడి: పాకిస్థాన్ అధికారుల సెలబ్రేషన్

image

పాక్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. పహల్గాం మారణహోమం తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుందని తెలుస్తోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఆ దేశ దౌత్యాధికారులు రాక్షసానందం పొందారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ ఉదయం హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు భారీగా చేరుకుని పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. PoKను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

News April 24, 2025

పహల్‌గామ్ ఉగ్రదాడిని ఖండించిన సీడబ్ల్యూసీ

image

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ మీటింగ్‌లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పహల్‌గామ్ ఉగ్రదాడిని సీడబ్ల్యూసీ ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.

News April 24, 2025

క్షిపణుల్ని పరీక్షించిన పాక్!

image

భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్ క్షిపణి ప్రయోగాలు చేపట్టనుండటం చర్చనీయాంశంగా మారింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే మిస్సైల్స్‌ను ఈరోజు, రేపు కరాచీ తీరంలో పాక్ పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత భద్రతావర్గాలు తెలిపాయి. భారత్ ఏమైనా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పాక్ మంత్రి ఒకరు హెచ్చరించడం గమనార్హం.