News September 5, 2025

ట్రే పద్ధతిలో విత్తన మొలకశాతం లెక్కింపు

image

ఆముదం, వేరుశనగ, పత్తి వంటి లావు గింజల విత్తనాలను ట్రే పద్ధతిలో పరీక్షించవచ్చు. ఒక ప్లాస్టిక్ ట్రేని గానీ, కుండని గానీ ఇసుకతో నింపి వంద విత్తనాలను అంగుళం లోతుగా నిర్ణీత దూరంలో విత్తాలి. మట్టిని నీటితో తడుపుతూ ఉంటే 7 నుంచి 10 రోజుల్లో మెులకలు వస్తాయి. వందకు ఎన్ని మొలకలు వచ్చాయో లెక్కించి మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు. నిర్దేశించిన శాతం కన్నా తక్కువ మొలకలొస్తే నాణ్యత లోపించిన విత్తనాలుగా భావించాలి.

News September 5, 2025

పేపరు టవలు పద్ధతిలో మొలకశాతం లెక్కింపు

image

వరి, పత్తి, పొద్దుతిరుగుడు, జొన్న వంటి విత్తనాల మొలక శాతం తెలుసుకోవడానికి ఈ పద్ధతి అనుకూలం. ముందుగా పేపరు టవలు లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకొని నీటితో తడపాలి. దీన్ని నేలపై పరిచి వంద విత్తనాలను వరుస క్రమంలో అమర్చాలి. విత్తనాలపై మరో పేపరు టవలు లేదా వస్త్రాన్ని కప్పాలి. ఈ రెండింటిని చాపలా చుట్టి చివర్లను దారంతో కట్టి లోతుగా ఉన్న పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. అప్పుడప్పుడు నీటితో తడిపితే మొలకలొస్తాయి.

News September 5, 2025

మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

image

☛ 90% – మొక్కజొన్న (సంకర రకాలు) ☛ 85% – శనగ
☛ 80% – వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)
☛ 75% – జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద ☛ 70% – ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు. ☛ 65% – పత్తి, బెండ, కాలిఫ్లవర్
☛ 60%- మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర
పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

News September 5, 2025

భాగ్యనగరానికి సమీపాన ‘సరస్వతీ దేవి’ ఆలయం

image

బాసర క్షేత్రానికి వెళ్లలేని భక్తులు వర్గల్‌‌లో కొలువైన సరస్వతీ దేవిని దర్శించుకొని తృప్తి చెందుతుంటారు. ఈ మందిరం HYD నుంచి 45KM దూరంలో సిద్దిపేట జిల్లాలో కొలువై ఉంది. దీన్ని 1992లో నిర్మించారు. ఇక్కడ చిన్నారులకు నిత్యం అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. నిత్యాన్నదానం ఉంటుంది. కంచి శంకర మఠం ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతోంది. ఈ క్షేత్రంలో గణేశుడు, సాంబశివుడు, వేంకటేశ్వర స్వామివార్లు దర్శనమిస్తారు.

News September 5, 2025

శుక్రవారం నాడు డబ్బు ఎందుకు బయటకి ఇవ్వకూడదు?

image

శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఈరోజు డబ్బులు బయటకు ఇస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతుందని, అందువల్ల కష్టాలు వస్తాయని భావిస్తారు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదని అంటుంటారు. అయితే ఇది అపోహ మాత్రమే అనేవారు కూడా ఉన్నారు. ‘ఒకసారి ఖర్చు చేస్తే అదే అలవాటుగా మారే అవకాశం ఉంటుంది. దాన్ని ఆపాలనే ఉద్దేశంతో, ధనాన్ని పొదుపు చేయాలనే ఆలోచనతో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టార’ని మరికొందరు చెబుతారు.

News September 5, 2025

గణేషుడిని ఎందుకు నిమజ్జనం చేస్తాం?

image

వినాయకుడిని 21 రకాల పత్రాలతో పూజిస్తాం. ఆ ఆకులతో సహా మట్టి గణపతిని జలకళ సంతరించుకున్న నది/చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు క్రిమి రహితంగా మారుతుందని పెద్దలు చెబుతున్నారు. మట్టి విగ్రహాలను తీరం వెంబడి నిమజ్జనం చేస్తే వరద పోటు తగ్గుతుందనే భావన కూడా ఉంది. అందుకే నిమజ్జనం ఆచారం ఉండే బతుకమ్మ/దసరా పండగలు కూడా వర్షాకాలంలోనే వస్తాయని అంటారు. నిమజ్జనం అనేది అశాశ్వతకు ప్రతీకని మరికొందరు చెబుతారు.

News September 5, 2025

వినాయకుడి నిమజ్జనం.. ఇలా చేస్తే పుణ్యం

image

గణేశుడి నిమజ్జనం పవిత్రంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వినాయకుడికి ఉద్వాసన పలికే ముందు పూజ చేసి, గుంజీలు తీయాలి. పత్రి ఆకులతో చేసిన కంకణాలు చేతికి కట్టుకోవాలి. హారతి ఇచ్చి విగ్రహాన్ని జరపాలి. చెరువు దగ్గరకు చేరుకున్నాక అగరబత్తులు వెలిగించి, పువ్వులు పెట్టాలి. కొబ్బరికాయ కొట్టి మరోసారి హారతి ఇవ్వాలి. విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసి ‘వచ్చే ఏడు మళ్లీ రావయ్యా’ అని మొక్కాలి.

News September 5, 2025

ప్రధానితో సమావేశమైన నారా లోకేశ్

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘యోగాంధ్ర టేబుల్ బుక్‌’ను PM ఆవిష్కరించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాజకీయ పరిస్థితులపై మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని టైట్ షెడ్యూల్‌ మధ్య ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత కేంద్ర మంత్రులను లోకేశ్ కలవనున్నారు.

News September 5, 2025

మాట మార్చిన ట్రంప్

image

శాంతిదూతగా తనని తాను ప్రదర్శించుకుంటున్న US అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. మొన్నటి వరకు 7 యుద్ధాలు ఆపానని.. ఇప్పుడు 3 యుద్ధాలే ఆపినట్లు చెప్పారు. ‘ఒకటి 31 ఏళ్లుగా కొనసాగుతొంది, అందులో కోటిమంది చనిపోయారు. ఇంకొకటి 34 ఏళ్లు, మరొకటి 37 ఏళ్లుగా కొనసాగుతున్నవి’ అని టెక్ సంస్థల CEOలకు ఇచ్చిన విందులో పేర్కొన్నారు. అయితే ఏ దేశాల మధ్య అనే విషయాన్ని ప్రస్తావించలేదు.

News September 5, 2025

మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం: సీఎం

image

AP: ప్రజలకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. అందుకు ప్రత్యేకమైన మెళకువలు అవసరం’ అని తెలిపారు. ప్రభుత్వం క్వాంటమ్‌ వ్యాలీని ఏర్పాటు చేయబోతోందని, అవసరమైన ఎకో సిస్టమ్‌ తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.