News April 17, 2024

BREAKING: సీఎం జగన్‌పై దాడి కేసులో BIG UPDATE

image

AP: సీఎం జగన్‌పై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురు అనుమానితుల్లో ఓ మైనర్ తానే దాడి చేసినట్లు అంగీకరించాడు. వీరంతా మైనర్లు కావడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యువకుల ఫోన్ లొకేషన్‌తో పాటు ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు. అటు యువకులను అదుపులోకి తీసుకోవడంతో వడ్డెర కాలనీలో వారి తల్లిదండ్రులు నిన్న ఆందోళనకు దిగారు.

News April 17, 2024

ఏబీవీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

AP: తనను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ IPS AB.వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై CAT తీర్పును రిజర్వ్ చేసింది. కేంద్రం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చారని ఆయనపై అభియోగాలు రావడంతో సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనంతరం ఈ కేసులో సాక్ష్యులను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో మళ్లీ సస్పెండ్ అయ్యారు. దీనిపై ఆయన CATను ఆశ్రయించగా.. 23న తీర్పు రానుంది.

News April 17, 2024

నేడు కేరళకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ, రేపు కేరళలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కాంగ్రెస్ తరఫున ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పోటీ చేసే వయనాడ్, అలిప్పీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు.

News April 17, 2024

బట్లర్ విధ్వంసం.. ఆ రెండు శతకాలు వృథా

image

RR ప్లేయర్ బట్లర్ ఈ ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేసి మరో రెండు శతకాలకు విలువ లేకుండా చేశారు. ఏప్రిల్ 6న జరిగిన ఆర్సీబీ, రాజస్థాన్ మ్యాచ్‌లో కోహ్లీ(113*) శతక్కొట్టి 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనలో బట్లర్ ఇన్నింగ్స్ చివరి బంతికి సెంచరీ చేసి తన టీమ్‌ను గెలిపించారు. నిన్న RRపై ధనాధన్ ఇన్నింగ్స్‌తో నరైన్(109) సెంచరీ చేయగా ఛేదనలో బట్లర్ (107*) మరోసారి విజృంభించి అతడి శతకం వృథా అయ్యేలా చేశారు.

News April 17, 2024

ఆదర్శప్రాయం శ్రీ రాముడి జీవితం

image

రఘువంశ శ్రేష్ఠుడు శ్రీరాముడి జీవితం సకల జనులకు ఆదర్శప్రాయం. ఆయన నుంచి అనేక అంశాలను నేర్చుకోవచ్చు. తల్లిదండ్రుల మాట దాటని కొడుకుగా, భార్యను రక్షించుకునే గొప్ప భర్తగా, ఇచ్చిన మాట మరవని స్నేహితుడిగా, మర్యాద రాముడిగా, ఎల్లవేళలా ఓపికతో ఉండే వ్యక్తిగా, ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన రాజుగా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణాలు. భగవంతుడే స్వయంగా మానవ జన్మ ఎత్తి ఎలా బతకాలో లోకానికి చూపించారు.

News April 17, 2024

సీఎం జగన్ ప్రచారానికి నేడు విరామం

image

AP: ‘మేమంతా సిద్ధం’ ప్రచారానికి వైఎస్ జగన్ నేడు విరామం ఇచ్చారు. పండుగల సమయంలో యాత్రకు ఆయన విరామం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు శ్రీరామనవమి కావడంతో ఈరోజు విరామం తీసుకున్నారు. పశ్చిమ గోదావరిలో ప్రస్తుతం యాత్ర కొనసాగుతోంది. తణుకు వద్ద తేతలిలో ఆయన రాత్రి బస చేశారు. ఈరోజు కూడా ఆయన ఇక్కడే ఉండనున్నారు. తిరిగి రేపు ఉదయం యాత్ర పున: ప్రారంభం కానుంది.

News April 17, 2024

మ.12 గంటలకే వివాహం ఎందుకు?

image

సీతారాముల కల్యాణం సరిగ్గా మ.12 గంటలకు జరుగుతుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో మ.12కు జన్మించినట్లు పురాణాల్లో ఉంది. ఇదే ముహూర్తాన పట్టాభిషిక్తుడవడం విశేషం. అలాగే రాముడు అవతరించిన రోజునే కల్యాణం జరిపించాలని పురాణగాథలు చెబుతున్నాయి. దీంతో రాముడి పుట్టిన సమయాన్నే వివాహ సమయంగా నిర్ణయించి ఏళ్లుగా పండితులు కల్యాణం జరిపిస్తున్నారు.

News April 17, 2024

సైబర్‌ నేరగాళ్లతో రైతులు జాగ్రత్త!

image

TG: రైతులకు సైబర్‌ నేరగాళ్ల ముప్పు పొంచి ఉందని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, రైతుల బ్యాంకు ఖాతాల్లో పడే పంట డబ్బులను OTP ద్వారా మాయం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారని రిజిస్ట్రార్ వెంకటరమణ హెచ్చరించారు. ఈమేరకు సైబర్ సెక్యూరిటీపై వెబినార్‌ నిర్వహించారు. రైతులను అప్రమత్తం చేసేందుకు వర్సిటీ సైంటిస్టులు, అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.

News April 17, 2024

నేడు మార్కెట్లకు సెలవు

image

ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్ఈ(బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ), ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్)లు ఈరోజు మూసి ఉంటాయి. బులియన్, ఫారెక్స్ మార్కెట్లు కూడా పని చేయవు. కమొడిటీ మార్కెట్లు సాయంత్రం 5గంటల నుంచి పని చేస్తాయి. కమొడిటీ మార్కెట్ అంటే సుగంధ ద్రవ్యాలు, విలువైన లోహాలు, ముడి చమురు వంటి లావాదేవీలకు సంబంధించింది.

News April 17, 2024

రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

image

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.