News April 15, 2024

డీజీపీని వెంటనే సస్పెండ్ చేయాలి: రామకృష్ణ

image

APలో రాళ్ల రాజకీయం మొదలైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ‘అధికార, ప్రతిపక్ష నేతలపై రాళ్ల దాడి జరుగుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది? సీఎం జగన్‌పై దాడికి డీజీపీ బాధ్యత వహించాలి. వెంటనే డీజీపీని సస్పెండ్ చేయాలి. సీఎంపై రాయి విసరడం ముమ్మాటికీ తప్పే. కానీ దీనిని వైసీపీ రాజకీయం చేయడం సరికాదు’ అని ఆయన పేర్కొన్నారు.

News April 15, 2024

దారుణం.. కారుపై మృతదేహంతో 18కి.మీ ప్రయాణం

image

AP: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఆత్మకూరు(మ) వై.కొత్తపల్లి సమీపంలో నిన్న రాత్రి ఓ బైకును కారు ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న ఎర్రిస్వామి(35) అనే వ్యక్తి ఎగిరి కారుపై పడిపోయారు. గమనించని కారు డ్రైవర్ మృతదేహంతో కళ్యాణదుర్గం వైపు 18 KM ప్రయాణించారు. బెళుగుప్ప సమీపంలో వాహనదారులు కారుపై మృతదేహాన్ని గమనించి.. వాహనానికి అడ్డంగా వెళ్లి ఆపారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ విషయం తెలిసి పరారయ్యాడు.

News April 15, 2024

అఫ్గానిస్థాన్‌ను వణికిస్తున్న వరదలు

image

ఒక్కసారిగా వచ్చి పడిన వరదలు అఫ్గానిస్థాన్‌ను వణికిస్తున్నాయి. వాటి కారణంగా గడచిన 3 రోజుల్లోనే దేశంలో కనీసం 33మంది కన్నుమూయగా, 27మంది తీవ్రగాయాలపాలయ్యారు. 606 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఫరా, హెరాత్, జాబుల్, కాందహార్ తీవ్రంగా నష్టపోయాయి. హిమపాతం, వర్షం, వరదలు కాందహార్ ప్రావిన్సును తీవ్రంగా ప్రభావితం చేశాయని తాలిబాన్ సర్కారు ప్రతినిధి తెలిపారు.

News April 15, 2024

గులకరాయి డ్రామాకు కేశినేని, వెల్లంపల్లి సూత్రధారులు: బొండా ఉమ

image

AP: వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం జగన్ గులకరాయి డ్రామా ఆడారని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. దీనికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సూత్రధారులని ఆరోపించారు. వారిద్దరి కాల్ లిస్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు బయట పెడతామన్నారు. ఈ ఘటనపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

News April 15, 2024

న్యాయవ్యవస్థను కాపాడండి: సీజేఐకు విశ్రాంత జడ్జిల లేఖ

image

భారత్‌లో న్యాయవ్యవస్థను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి 21మంది విశ్రాంత న్యాయమూర్తులు లేఖ రాశారు. కొన్ని ముఠాలు తెలివిగా వ్యవహరిస్తూ న్యాయవ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే కొంతమంది, ప్రజల్లో కోర్టులపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి న్యాయాన్ని రక్షించాలని సీజేఐను కోరారు.

News April 15, 2024

జూ.ఎన్టీఆర్‌తో రౌతేలా సెల్ఫీ

image

గ్లోబల్ స్టార్ జూ.ఎన్టీఆర్ వార్-2 సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఆయన్ను నటి ఊర్వశీ రౌతేలా కలిశారు. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా సెల్ఫీ తీసుకున్న ఆమె ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ఎన్టీఆర్ గారు.. మీరే నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. మీ క్రమశిక్షణ, వ్యక్తిత్వం ప్రశంసనీయం. త్వరలో మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చారు.

News April 15, 2024

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

image

అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ చిత్రం ‘సైతాన్’. గత నెల 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ మే 3న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.

News April 15, 2024

కవితపై జడ్జి సీరియస్!

image

MLC కవితను కోర్టులో హాజరుపర్చిన సందర్భంలో ఆమెపై జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడొద్దని సీరియస్ అయ్యారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకే తాను బదులిచ్చానని కవిత చెప్పడంతో.. అయినా సరే ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మరోసారి అలా మాట్లాడొద్దని జడ్జి సూచించారు. కాగా ‘ఇది CBI కస్టడీ కాదు, BJP కస్టడీ. బయట BJP అడిగిందే, లోపల CBI అడుగుతోంది’ అని కవిత వ్యాఖ్యానించారు.

News April 15, 2024

మార్పు అంటే ఇదేనా?: కిషన్ రెడ్డి

image

TG: పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని BJP రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. గత BRS ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మార్పు అంటే KCR కుటుంబం పోయి.. సోనియా కుటుంబం వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలు అంటే మోసం చేసేవా? అని ప్రశ్నించారు.

News April 15, 2024

న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా: సునీత

image

AP: వివేకా హత్య కేసులో న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు ఆయన కుమార్తె సునీత వెల్లడించారు. HYDలో ఈ కేసు వివరాలను బయటపెట్టిన ఆమె.. ‘జగన్‌తో మాట్లాడేందుకు నేను సిద్ధం. గతంలో కొన్నిసార్లు CMతో మాట్లాడా. ఆ తర్వాత అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అందుకోసం సీఎంకు ఎన్నో లేఖలు రాశా. హత్య జరిగిన సమయంలో అవినాశ్ రెడ్డి, గంగిరెడ్డి మధ్య ఫోన్‌కాల్స్ ఉన్నాయి. దీనిపై సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.