News March 23, 2024

కిడ్నీ తీసుకుని లాలూ టికెట్ ఇచ్చారు: బిహార్ డిప్యూటీ సీఎం

image

బిహార్‌ డిప్యూటీ CM, BJP నేత సామ్రాట్ చౌదరీ RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘పార్టీ టికెట్లు అమ్మడంలో ఆరితేరిన లాలూ కుమార్తె రోహిణికీ మినహాయింపు ఇవ్వలేదు. ఆమె నుంచి కిడ్నీ తీసుకుని టికెట్ ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని RJD కౌంటర్ ఇచ్చింది. లాలూ కుమార్తెకు టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతున్న వేళ సామ్రాట్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 23, 2024

జీవితకాల గరిష్ఠానికి దేశ ఫారెక్స్ నిల్వలు

image

మార్చి 15తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు జీవిత కాల గరిష్ఠ స్థాయి $642.292 బిలియన్లకు చేరుకున్నాయి. గత వారంతో పోలిస్తే $6.396 బిలియన్లు పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇదే సమయంలో గోల్డ్ నిల్వల విలువ $425 మిలియన్లు పెరిగి $51.140 బిలియన్లకు చేరుకున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా 2022లో దేశ ఫారెక్స్ నిల్వలు $71 బిలియన్లు క్షీణించగా, 2023లో $58 బిలియన్లు పెరగడం విశేషం.

News March 23, 2024

కవితకు మరో షాక్!

image

ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆమె కస్టడీని కోర్టు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నేటితో కవిత కస్టడీ ముగియగా.. కాసేపట్లో ఆమెను ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. కవితకు మరో 3 రోజులు కస్టడీని పొడిగించాలని కోరే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేయడంతో వీరిద్దరినీ కలిపి విచారించాలని ఈడీ భావిస్తోంది.

News March 23, 2024

ధోనీ గురించి నాకు బాగా తెలుసు: అశ్విన్

image

CSK కెప్టెన్‌గా రుతురాజ్‌ను ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యంగా అనిపించలేదని అశ్విన్ తెలిపారు. ‘ధోనీ గురించి నాకు బాగా తెలుసు. అతడు ఏది చేసినా ఫ్రాంచైజీ బాగుకోసమే. కెప్టెన్సీ విషయమై రుతురాజ్‌తో గతేడాదే చర్చించి ఉంటారు. నాయకత్వ బాధ్యతలపై కంగారు పడొద్దు. నేను కూడా అక్కడే ఉంటా అని రుతురాజ్‌తో ధోనీ చెప్పే ఉంటారు’ అని అశ్విన్ తెలిపారు. ఇక కెప్టెన్‌గా రుతురాజ్ తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్న విషయం తెలిసిందే.

News March 23, 2024

కేసీఆర్‌ను చుట్టుముట్టిన కష్టాలు

image

అధికారం దూరం కాగానే కేసీఆర్‌ను కష్టాలు చుట్టుముట్టాయి. లిక్కర్ స్కాం కేసులో తన కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ హయాంలో పనిచేసిన అధికారులు అరెస్ట్ అవుతున్నారు. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అయితే వీటన్నింటినీ తట్టుకుని గులాబీ బాస్ మళ్లీ అధికారం చేజిక్కించుకుంటారని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News March 23, 2024

రోజూ మద్యం, మాంసం ఉంటేనే ఇంటికి వస్తా.. భార్య డిమాండ్

image

ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య పెట్టిన డిమాండ్లకు భర్త షాకయ్యాడు. రోజూ మద్యం, మాంసం ఉంటేనే అత్తారింటికి వస్తానని చెప్పి పుట్టింట్లోనే ఉండిపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో జరిగింది. ఇండోర్‌కు చెందిన నేహా జైన్‌తో చిరాగ్‌కు గత ఏడాది పెళ్లయ్యింది. కొన్ని రోజులకే అసలు రూపాన్ని బయటపెట్టిన భార్య.. పుట్టింటికి వెళ్లి పోయి వింత డిమాండ్లతో భర్తను వేధిస్తోంది.

News March 23, 2024

హిందూ మహిళ బొట్టు పెట్టుకోవడం మతపరమైన బాధ్యత: కోర్టు

image

ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఫ్యామిలీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ మహిళ నుదుటిన బొట్టు పెట్టుకోవడం మతపరమైన బాధ్యత అని, అది ఆమెకు పెళ్లయిందనే విషయాన్ని తెలియజేస్తుందని పేర్కొంది. వరకట్నం కోసం భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోర్టుకు తెలిపిన భార్య.. ఎలాంటి ఆధారాలను చూపలేకపోయిందని న్యాయమూర్తి చెప్పారు. వెంటనే ఆమె భర్త ఇంటికి వెళ్లాలని సూచించారు.

News March 23, 2024

ELECTION TREND.. వెడ్డింగ్ కార్డులపై మోదీ, పవన్ ఫొటోలు

image

ఎన్నికల వేళ రాజకీయ నేతలపై కొందరు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తన పెళ్లి పత్రికపై ముద్రించాడు TSలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి కుమార్. ‘నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి నరేంద్రమోదీకి వేసే ఓటు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇటు ఏపీలోని పాడేరులో పవన్ కళ్యాణ్ అభిమాని ఇదే తరహాలో వెడ్డింగ్ కార్డుపై పవన్ కళ్యాణ్ ఫొటో ముద్రించి.. ఆయనకు తోడుగా ఉంటామని రాసుకొచ్చాడు.

News March 23, 2024

కెప్టెన్సీని ఆస్వాదించా: రుతురాజ్

image

మ్యాచ్ ఆసాంతం కెప్టెన్సీని ఆస్వాదించానని చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ‘బెంగళూరుతో మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. మహీ భాయ్ సూచనలతో ముందుకెళ్లా. సీనియర్లు ఉన్న జట్టుని ఎలా నడిపిస్తాడో అని అందరూ అనుకుని ఉంటారు. కానీ నాకు అలాంటిదేం లేదు. మ్యాచ్‌లో బెంగళూరును 15 పరుగులు తక్కువకే నిలువరించాం. దీంతో మా విజయం సులువైంది’ అని ఆయన పేర్కొన్నారు.

News March 23, 2024

మూడంచెల వ్యూహం.. గెలుపే లక్ష్యం

image

TG: లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్.. మూడంచెల వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ సమన్వయ కమిటీలు నియమించనుంది. ఈమేరకు శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిశానిర్దేశం చేస్తున్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై వివరిస్తున్నారు. దీంతో ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు కానున్నాయి.