News February 21, 2025
మా దేశంలో ఉండొద్దు.. బీబీసీకి అజెర్‌బైజాన్ ఆదేశాలు

తమ దేశంలోని కార్యాలయాలు మూసేసి వెళ్లిపోవాలని వార్తాసంస్థ బీబీసీని అజెర్‌బైజాన్ ఆదేశించింది. తమ చట్టప్రకారం కార్యాలయం నడిపే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చిచెప్పింది. దీంతో తమ కార్యాలయం మూసేయక తప్పలేదని, మీడియా స్వేచ్ఛను అజెర్‌బైజాన్ తుంగలో తొక్కిందని బీబీసీ ఓ ప్రకటనలో ఆరోపించింది. బీబీసీ ఆ దేశంలో 1994 నుంచి పనిచేస్తోంది. మరోవైపు.. BBC ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తోందని అజెర్‌బైజాన్ మండిపడింది.
Similar News
News February 22, 2025
154మంది భారతీయులకు పాకిస్థాన్ వీసాలు జారీ

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో శ్రీ కటాస్ రాజ్ ఆలయాల్ని సందర్శించేందుకు వస్తున్న 154మంది భారతీయులకు వీసాలు జారీ చేశామని ఆ దేశ హైకమిషన్ శుక్రవారం తెలిపింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2 వరకూ వారు పర్యటిస్తారని పేర్కొంది. ‘ఇరు దేశాల పరస్పర గౌరవం, మతసామరస్యం కోసం ఇలా వీసాలు జారీ చేస్తూనే ఉంటాం’ అని స్పష్టం చేసింది. ప్రతీ ఏటా వేలాదిమంది పర్యాటకులు పాక్‌లో ఆలయాల సందర్శనం కోసం వెళ్తుంటారు.
News February 22, 2025
రెండు కార్పొరేషన్లుగా మారనున్న GHMC?

TG: హైదరాబాద్ పరిధి మరింతగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో GHMCపై పడుతున్న భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ అనే 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. 150 డివిజన్లను చెరిసగం విభజించిన అనంతరం శివారు మున్సిపాలిటీలు, గ్రామాల్ని కూడా విలీనం చేయొచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీనిపై కసరత్తు మొదలైందని పేర్కొన్నాయి.
News February 22, 2025
త్వరలో ఆర్మీ చేతికి 220 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్

తమ అమ్ములపొదిని మరింత శక్తిమంతం చేసుకునేందుకు, గగనతల ప్రమాదాల నుంచి రక్షణకు 220 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్‌ను కొనుగోలు చేయాలని ఆర్మీ భావిస్తోంది. ఈ ఏడాది జూలైలో రెండు దేశీయ సంస్థల ఉత్పత్తుల్ని పరీక్షించనుంది. 1990వ దశకం తర్వాత ఆర్మీ ఈ తరహా వ్యవస్థల్ని కొనుగోలు చేయలేదు. అప్పట్లో కొన్న L-70, Zu-23 వ్యవస్థలు ఔట్‌డేటెడ్ అయిపోయాయి. వాటి స్థానంలోనే ఈ కొత్త గన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.