Anantapur

News August 29, 2024

అనంత మార్కెట్లో టమాటా కిలో రూ.23

image

అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో బుధవారం 3,800 టన్నులు టమాటాను రైతులు తీసుకొచ్చారు. 28 మండీల్లో టమాటా విక్రయాలు కొనసాగాయి. ఉదయం వేలం పాటలు నిర్వహించారు. కిలో గరిష్ఠంగా రూ.23, మధ్యస్థం రూ.15, కనిష్ఠం రూ.6 చొప్పున ధరలు పలికాయి. 15 కిలో బుట్ట ధర పరిశీలిస్తే గరిష్ఠ ధర రూ.345, మధ్యస్థం రూ.225, కనిష్ఠం రూ.90 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ ఇన్‌ఛార్జ్ రాంప్రసాద్ రావు తెలిపారు.

News August 29, 2024

‘ప్రధాన రహదారిలో గుంత తీసి వదిలేశారు’

image

రొద్దం మండలం వైఎస్ఆర్ సర్కిల్లో ప్రధాన రహదారి పక్కనే మరమ్మతుల నిమిత్తం 4 రోజుల క్రితం అధికారులు కాలువ తీయించి దానిని అలాగే వదిలేశారు. నిత్యం రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో ఇంత లోతు గుంత తీయించిన అధికారులు అక్కడ కనీసం ప్రమాద సూచికను ఏర్పాటు చేయకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మలుపు ఉండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి గుంత పూడ్చాలని కోరారు.

News August 29, 2024

ఇసుక దందా సాగనివ్వను: తాడిపత్రి ఎమ్మెల్యే

image

రైతులకు హాని చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని, దందా ఏ రూపంలో ఉన్నా జరగనివ్వనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం అనంతపురంలో ఎస్పీ జగదీశ్‌ను కలిసిన అనంతరం మాట్లాడారు. లారీలను పట్టుకున్న తమ కార్యకర్తలపై మాఫియా గ్యాంగ్ దాడి చేస్తే స్పందించక పోగా, రాజీ కావాలని సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. భయపెడుతున్నాడని ఆరోపించారు.

News August 29, 2024

అన్ని పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలి: కలెక్టర్ టీఎస్ చేతన్

image

సత్యసాయి జిల్లాలోని అన్ని పరిశ్రమలలో ప్రమాదాల నివారణపై అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల నిర్వహణ, ప్రమాదాల నియంత్రణపై అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

News August 28, 2024

అనంతపురానికి క్రికెటర్లు.. స్టేడియాన్ని పరిశీలించిన ఎస్పీ

image

అనంతపురం పట్టణ సమీపంలోని ఆర్డీటీ స్టేడియాన్ని జిల్లా ఎస్పీ జగదీశ్ అధికారులతో కలిసి సందర్శించారు. స్టేడియంలో సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ నిర్వహించాల్సిన భద్రత గురించి అధికారులు, స్టేడియం నిర్వహకులతో చర్చించారు. సుమారు 50 మందికిపైగా భారత క్రికెటర్లు నగరానికి వస్తుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

News August 28, 2024

పుట్టిన రోజు నాడే విద్యార్థి మృతి

image

ఉరవకొండలో తీవ్ర విషాదం నెలకొంది. పుట్టిన రోజు నాడే జ్వరంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. పట్టణంలోని 1వ వార్డుకు చెందిన హోంగార్డ్ బాబా ఫక్రుద్దీన్ కుమారుడు అజీమ్ షేక్(14) తీవ్ర జ్వరంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం మృతిచెందాడు. పుట్టిన రోజు నాడే మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News August 28, 2024

తాడిపత్రిలో ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి

image

తాడిపత్రి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై స్కార్పియో వాహనం, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 28, 2024

కోడిగుడ్లలో పురుగులు.. మంత్రి సవిత ఆగ్రహం

image

కళ్యాణదుర్గం, కంబదూరు, కుందుర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాలలోని ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. పురుగులు పట్టిన కోడిగుడ్లను పిల్లలకు ఇచ్చిన సమాచారం తెలుసుకున్న మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. నాణ్యమైన కోడిగుడ్లు, పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News August 28, 2024

అనంతపురం జిల్లాలో 10 మంది ఎస్సైల బదిలీ

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షీమోషి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మారం వన్ టౌన్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్‌ను అనంతపురం వన్ టౌన్‌కు, అనంతపురం వన్ టౌన్‌లో పనిచేస్తున్న రామకృష్ణను వీఆర్‌కు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న సుధాకర్ యాదవ్ అనంతపురం టూ టౌన్‌కు, ఇక్కడ ఉన్న రుషేంద్ర బాబును వీఆర్‌కు పంపారు. బదిలీ అయిన వారు వెంటనే విధులలో చేరాలన్నారు.

News August 28, 2024

శ్రీ సత్యసాయి: పెళ్లి చేయలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం

image

ధర్మవరం మండలం రావులచెరువుకు చెందిన ఆదెప్ప (30) తనకు తల్లిదండ్రులు పెళ్లి చేయలేదని మనస్తాపం చెంది ఇంట్లో గొర్రెలకు ఉపయోగించే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు గమనించి ఆదెప్పను ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.