Anantapur

News August 14, 2024

అనంతపురం టవర్ క్లాక్.. మన స్వాతంత్య్రానికి గుర్తు

image

అనంతపురం పేరు వినగానే ‘టవర్ క్లాక్’ గుర్తుకొస్తుంది. నగర నడిబొడ్డున ఉన్న ఈ టవర్ క్లాక్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయగా సిద్ధించిన స్వాతంత్ర్య ఉద్యమానికి గుర్తుగా అనంతపురంలో 1947 ఆగస్టు 15న నిర్మించారు. అష్ట భుజాలతో 47 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో నిర్మించారు. 15 అడుగుల వెడల్పు 15వ తేదీని, అష్ట భుజాలు 8వ నెలను, 47 అడుగుల ఎత్తు 1947వ సంవత్సరాన్ని సూచించేలా నిర్మించడం విశేషం.

News August 14, 2024

అనంతపురం.. 62 మంది సీఐల బదిలీ

image

అనంతపురం, కర్నూలు జిల్లాల రేంజ్ పరిధిలో 62 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి, అనంతపురం, గుంతకల్లు రైల్వే, అనంతపురం ఎస్పీ కార్యాలయాల్లో ఉన్న సీఐలను కర్నూలు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాలకు బదిలీ చేశారు. వారు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. పలువురిని వీఆర్‌కు పంపారు.

News August 14, 2024

ATP: హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

image

కంబదురు మండలంలో సోమవారం జరిగిన తిప్పేస్వామి హత్యకేసులో రాళ్ళపల్లి గ్రామానికి చెందిన మల్లెల రాజు, నరేశ్‌లను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ రవికుమార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై వస్తున్న తిప్పేస్వామిని రోడ్డుకు అడ్డగించి బండ రాళ్లతో దాడిచేసి హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు వివరించారు. కేసు ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు.

News August 14, 2024

అనంతపురం JNTU బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

image

అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూ పరిధిలో మే, జూన్ నెలల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ కేశవరెడ్డి తెలిపారు. బీఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్లు, రెండో సంవత్సరం రెండో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్, నాలుగో సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

News August 14, 2024

నేటి కలెక్టర్ సమావేశానికి మంత్రి సవిత రాక

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమావేశానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరవుతారని కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. నేటి ఉదయం 10:30 నుంచి 11:30 వరకు కలెక్టర్ కార్యాలయంలో.. కలెక్టర్ టిఎస్ చేత ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని, సమావేశం అనంతరం మంత్రి సబిత పెనుగొండకు వెళ్తారన్నారు.

News August 13, 2024

నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తప్పవు: మంత్రి సవిత

image

రేణిగుంట బీసీ వసతి గృహంలో అస్వస్థతకు గురైన 21 మంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీసీ వసతి గృహా అధికారులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. బయట ఆహారం తినడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, మీ పిల్లలకు ఇలాగ జరిగితే వదిలేస్తారా అని మంత్రి సిబ్బందిపై మండిపడ్డారు.

News August 13, 2024

అనంతపురం జిల్లాకు వర్షసూచన

image

ఉపరితల ద్రోణి కారణంగా రానున్న నాలుగు రోజుల్లో జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. మంగళవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షం పడొచ్చని తెలిపారు.

News August 12, 2024

రేపు తుంగభద్ర డ్యామ్‌కు కర్ణాటక సీఎం

image

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తుంగభద్ర డ్యామ్‌ను రేపు సందర్శించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో గేటు మరమ్మతుల పనులు పరిశీలించనున్నారు. దీంతో అందుకు తగ్గ ఏర్పాట్లను కొప్పల్, విజయనగర జిల్లాల అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌ను ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, రామానాయుడులు పరిశీలించారు.

News August 12, 2024

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేద్దాం: మంత్రి

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురు వేద్దామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలోని లలిత కళా పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకుందామని మంత్రి పేర్కొన్నారు.

News August 12, 2024

Way2News కథనానికి స్పందించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి

image

‘బుగ్గ నుంచి యాడికి వెళ్లాలంటే నరకయాతనే’ అనే శీర్షకతో ఈనెల 9న Way2News ప్రచురించిన కథనానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్పందించారు. గుంతలమయంగా మారిన రోడ్డును స్థానిక నాయకులు, సంబంధిత అధికారులతో మట్టి వేయించారు. గుంతలను పూడ్చివేయడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు, సమస్య పరిష్కారానికి కృషి చేసిన Way2News యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.