Anantapur

News June 9, 2024

ఉరవకొండ: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర గాయాలు

image

వజ్రకరూర్ మండలం వెంకటంపల్లి చిన్న తాండలో శనివారం రాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వజ్రకరూర్ నుంచి గ్రామానికి బైక్ పై వెళుతున్న తులసి నాయక్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. అనంతరం గ్రామంలో ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోగా.. ఇరుపార్టీల వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 9, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ఖైదీ మృతి

image

బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద టిప్పర్ ఢీకొని ఓపెన్ ఎయిర్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఈరన్న (50) అనే ఖైదీ మృతి చెందాడు. శనివారం రాత్రి ఖైదీ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News June 9, 2024

అనంత జిల్లాలో 116 మంది అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు

image

అనంత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు మినహా ఇతర అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇందులో జాతీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసిన 134 మంది అభ్యర్థుల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు 18 మంది పోగా మిగిలిన 116 మంది అభ్యర్థులు డిపాజిట్ దక్కించుకునేందుకు సరిపడా ఓట్లను సాధించలేక పోయారు.

News June 9, 2024

ఫాగింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురంలోని కోర్టు రోడ్ లో ఉన్న గుల్జార్ పేట్ ప్రాంతంలో ఫాగింగ్ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నగరంలో మురుగు నీరు నిల్వ ఉన్న చోట్ల బ్లీచింగ్ వేయాలని సూచించారు.

News June 9, 2024

అనంత అభివృద్ధికి అధికారులు సహకరించాలి: కలెక్టర్

image

అనంత నియోజకవర్గ అభివృద్ధికి ఆయా శాఖల అధికారులు సహకారం అందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నగరపాలక సంస్థ పరిధిలోని అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో వరద నిర్వహణలో భారీ వర్షం వచ్చి ఎక్కువ నీరు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికి పోతుంది, ఎక్కడ ప్రభావితం అవుతుంది అనే దానిపై వచ్చే 72 గంటల్లోగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు.

News June 8, 2024

రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవు: ఎస్పీ

image

సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెడితే.. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అందుకు గ్రూప్ అడ్మిన్లను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. కౌంటింగ్ అనంతరం వాట్సప్, ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో కొందరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నట్టు సమాచారం వస్తోందని, అలాంటి పోస్టులకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు.

News June 8, 2024

అనంత: రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల రాజీనామా

image

రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల శనివారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు.
అనంతపురం వైసీపీ నాయకుడు అనిల్ గౌడ్ సతీమణి ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ఓటమి చెందడంతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని అందించారు.

News June 8, 2024

అనంత: బొలెరో- బైక్ ఢీ.. వీఆర్ఓ మృతి

image

గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం వద్ద శనివారం ద్విచక్ర వాహనాన్ని లగేజ్ బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వీఆర్ఓ అమర(40) మృతిచెందాడు. గార్లదిన్నె మండలం కమలాపురానికి చెందిన అమర పామిడి మండలం కత్రిమల వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. పామిడి నుంచి కల్లూరుకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా కల్లూరు నుంచి పామిడి వైపు వెళ్తున్న లగేజ్ బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అమర అక్కడికక్కడే మృతిచెందారు.

News June 8, 2024

అనంత: అనతికాలంలో ఎన్నికల బరిలో నిలిచి.. ఎమ్మెల్యేగా గెలిచి

image

టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఉద్యమాలతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2017లో టీడీపీలో చేరిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమాలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలోనే ఆయనపై 50కిపైగా కేసులు నమోదయ్యాయి. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ కీలకంగా వ్యవహరించారు. మడకశిరలో తక్కువ సమయంలోనే ప్రజాదరణతో గెలుపొందారు.

News June 8, 2024

ఉరవకొండ: ఏటీఎం ధ్వంసం చేసి.. నగదు చోరీ

image

కూడేరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి దానిలోని నగదును అపహరించారు. ఎంత మొత్తంలో నగదు అపహరించారో తెలియడం లేదు. స్టేట్ బ్యాంక్ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.