Chittoor

News April 9, 2024

తిరుపతి MP అభ్యర్థిగా చింతామోహన్

image

కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ చింతామోహన్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. ఆయన ఇప్పటి వరకు 6 సార్లు తిరుపతి ఎంపీగా గెలిచారు. అలాగే ఇటీవల వైసీపీని వీడి హస్తం గూటికి చేరిన MS బాబుకు పూతలపట్టు MLA టికెట్ దక్కింది. ఆయన 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయనకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ మారారు. జీడీనెల్లూరు కాంగ్రెస్ MLA అభ్యర్థిగా రమేశ్ బాబు పోటీ చేయనున్నారు.

News April 9, 2024

చిత్తూరు జిల్లాలో చంద్రబాబుదే రికార్డ్

image

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు. ఆయన 1978లో చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 1983లో అక్కడ ఓడిపోయారు. 1985లో ఎక్కడా పోటీ చేయలేదు. 1989 నుంచి వరుసగా ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6 సార్లు విజయం సాధించారు. పీలేరు, పుంగనూరు నుంచి మూడేసి సార్లు MLAగా ఎన్నికయ్యారు.

News April 9, 2024

CTR: నిర్మాతలుగా మారిన వైసీపీ నాయకులు

image

హీరో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా షణ్ముఖ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రాన్ని చిత్తూరు వైసీపీ నాయకులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వైసీపీ పాలసముద్రం మండల కన్వీనర్ సప్పని తులసిరామ్, ఆయన సోదరులు షణ్ముగం యాదవ్, రమేశ్ యాదవ్ చిత్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా షణ్ముగం యాదవ్ కావడం విశేషం. వీళ్లంతా బెంగళూరులో బిల్డర్స్‌గా రాణిస్తున్నారు.

News April 9, 2024

పుంగనూరు నుంచి రామచంద్రయాదవ్ పోటీ

image

ఏపీలో భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేసే 32 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్(RCY) విడుదల చేశారు. పుంగనూరు నుంచి RCY పోటీ చేయనుండగా తిరుపతిలో కృష్ణవేణి యాదవ్, శ్రీకాళహస్తిలో దినాడ్ బాబు, పూతలపట్టులో నాంపల్లి భాను ప్రసాద్ బరిలో ఉంటారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.

News April 9, 2024

తిరుపతి: వేసవికి ప్రత్యేక రైళ్లు

image

వేసవి సెలవుల నేపథ్యంలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి- మచిలీపట్నం (07121) రైలు ఏప్రిల్ 14, 21, 28 తేదీల్లో, మే 5, 12, 19, 26 తేదీల్లో నడపనున్నారు. మచిలీపట్నం- తిరుపతి (07122) రైలు ఏప్రిల్ 15, 22, 29 తేదీల్లో, మే 6, 13, 20, 27 తేదీల్లో నడవనుంది. ఈ ప్రత్యేక రైళ్లు నిర్దేశించిన తేదీల్లో తిరుపతి నుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు వైపు వెళుతాయి .

News April 9, 2024

మదనపల్లె: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళ లేక చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉగాది పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు.  2టౌన్ పోలీసుల కథనం… మదనపల్లె, నీరుగట్టువారిపల్లి, మాయబజార్లో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు జి.మల్లికార్జున(42) భార్య మాధవి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లకు అప్పు చేసి పెళ్లిళ్లు చేశాడు. దీంతో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

News April 9, 2024

చిత్తూరు: వేడెక్కిన నగరం.. రహదారులు ఖాళీ

image

చిత్తూరు నగరం మండే ఎండలతో వేడెక్కింది. సోమవారం ఉదయం 11 గంటలు దాటగానే చాలా రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. సోమవారం అత్యధికంగా తవణంపల్లెలో 42.3, నిండ్రలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా.. నగరిలో 41.6, విజయపురంలో 41.6, శ్రీరంగరాజపురంలో 41.4, పుంగనూరులో 40.4, సోమలలో 40.1, బంగారుపాళ్యంలో 39.9, పాలసముద్రంలో 39.9, కార్వేటినగరంలో 39.8, గుడిపాలలో 39.7, సదుంలో 39.7 నమోదయింది.

News April 9, 2024

చిత్తూరు: రాజకీయ పార్టీలకు ఎస్పీ సూచనలు

image

ఇంటింటి ప్రచారం కోసం ముందస్తుగా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని రాజకీయ పార్టీలకు ఎస్పీ మణికంఠ సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో బాణసంచా ఉపయోగించరాదన్నారు. పోస్టాఫీసులు, బ్యాంకుల నుంచి నగదును ఇతర పోస్టాఫీసులు, బ్యాంకులకు తరలిస్తుంటే ఆయా రిటర్నింగ్‌ అధికారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య, వివిధ బృందాల అధికారులు,నోడల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

News April 9, 2024

పలమనేరు: తాళిబొట్టుతో మాంత్రికుడు పరార్

image

పలమనేరు పట్టణ పరిధిలోని గంటావూరు కాలనీలో ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చి మనశ్శాంతి ఉండేలా చేయాలని జ్యోతి కర్ణాటక ప్రాంతంలోని ఓ మాంత్రికుడ్ని ఆశ్రయించారు. మాంత్రికుడు ఇంటికి వచ్చి ఆమె మెడలోని తాళిబొట్టుకు పూజలు చేయాలని తీసుకున్నాడు. ఒక చెంబులో ఉంచి పూజలు చేశాడు. రోజంతా దేవుని చిత్రపటం వద్ద ఉంచాలన్నాడు. చెంబు తెరిచి చూడగా అందులో 20 గ్రాముల బంగారు తాళిబొట్టు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 8, 2024

చిత్తూరు: ఇద్దరు మహిళలకే అవకాశం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 MLA, 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే బరిలో ఉన్నారు. వైసీపీ జీడీ నెల్లూరు MLA అభ్యర్థిగా కృపాలక్ష్మి, నగరి అభ్యర్థిగా రోజా పోటీ చేయనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో మహిళకు అవకాశం దక్కలేదు. గతంలో గల్లా అరుణ కుమారి నాలుగు సార్లు, గుమ్మడి కుతూహలమ్మ ఐదు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మూడు సార్లు మంత్రులుగా పనిచేశారు.