Chittoor

News July 27, 2024

నవోదయ ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలన్నారు

image

చిత్తూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ దేవరాజు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25వ విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక పరీక్ష జనవరి 18న నిర్వహిస్తామన్నారు.

News July 27, 2024

మదనపల్లె: పోలీసుల అదుపులో వైసీపీ నేత!

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆదివారం రాత్రి జరిగిన ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసు అధికారులు దూకుడు పెంచారు. మదనపల్లె వైసీపీ నేత, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింక వెంకటచలపతిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొదట ఆయన ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే మరో వైసీపీ నేత బాబ్ జాన్ ఇంట్లోను తనిఖీలు చేయడానికి వెళ్లిన అధికారులకు సహకరించలేదని సమాచారం.

News July 27, 2024

కలికిరి: మర్రికుంటపల్లి వీఆర్ఓపై ఏసీబీ అధికారులు విచారణ

image

కలికిరి మండలం మర్రికుంటపల్లి వీఆర్వో క్రిష్ణయ్యపై ఎంఆర్ఓ సమక్షంలో ఏసీబీ అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. కామాక్షి అనే మహిళకు గజ్జలవారిపల్లి గ్రామం వద్ద తల్లి నుంచి సంక్రమించిన 23సెంట్ల భూమి ఆన్లైన్ చేయాలని వీఆర్ఓ ను ఆశ్రయించింది. వీఆర్ఓ రూ.5లక్షలు తీసుకున్నట్లు ఆరోపించింది. ఆన్లైన్ చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా వారి ఆదేశాలతో ACB అధికారులు విచారణ చేపట్టారు.

News July 27, 2024

తిరుపతి: బాలుడి శవం ఉత్తరప్రదేశ్‌కు తరలింపు

image

తిరుపతి జిల్లా నాగలాపురంలో బాలుడు మిక్కి(4) శుక్రవారం రాత్రి నీటితొట్టిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. బతుకుతెరువు కోసం నాగలాపురం వచ్చిన బాలుడి తల్లిదండ్రులు రాజేశ్, అనిత బాలుడి మృతదేహాన్ని 2000కి.మీ దూరంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాల్‌గంజ్ జిల్లా కేంద్రంలోని వారి స్వగృహానికి తరలించారు. ఏకైక సంతానం మరణించడంతో వారు పుట్టెడు దుఃఖంలో బాలుడిని తరలిస్తుంటే నాగలాపురం ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.

News July 27, 2024

చిత్తూరు: స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు

image

కేంద్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్ మంజూరు చేస్తోందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ చిత్తూరు సహాయ సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. 9, 10వ తరగతి చదువుతున్న వారు అర్హులని చెప్పారు. ఆగష్టు 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.depwd.gov.in, scholarships.gov.in వెబ్‌సైట్లు చూడాలన్నారు.

News July 26, 2024

TPT: అత్యాచారం కేసులో దంపతుల అరెస్ట్

image

తిరుపతిలో భార్యాభర్తల నయా దందా వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ పుదిపట్లకు చెందిన ప్రణవ్ కృష్ణ తన సహచర విద్యార్థిని తన ఇంటికి తీసుకెళ్లింది. భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో కలిసి కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చారు. మైకంలో ఉండగా కృష్ణకిషోర్ లైంగిక దాడి చేసి వీడియో తీశారు. బాధిత మహిళ అన్న, కాబోయే భర్తకు వీడియో పంపి డబ్బు డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు.

News July 26, 2024

ధరల పట్టిక తప్పనిసరిగా ఉండాలి: ఈవో

image

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు. త్వరలో ఆహార భద్రత ప్రమాణాలపై అన్నప్రసాదం సిబ్బంది, హోటల్‌ యజమానులకు శిక్షణ ఇస్తామన్నారు. తిరుమలలోని ప్రతి హోటల్ వద్ద ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News July 26, 2024

తిరుపతి ఎయిర్‌పోర్టు పేరు మార్పు..?

image

తిరుపతి(రేణిగుంట) ఎయిర్‌పోర్టు పేరు త్వరలో మారనున్నట్లు తెలుస్తోంది. శ్రీవేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయంలో ఈ విషయాన్ని పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ వెల్లడించారు. అలాగే విజయవాడకు నందమూరి తారకరామారావు, ఓర్వకల్లుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లను ప్రతిపాదించారు.

News July 26, 2024

కుప్పం:  ఫలితాలు విడుదల

image

కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో యూజీ, పీజీ పరీక్ష ఫలితాలను ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొ.ఎం. దొరస్వామి విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ జూన్, జులై 2024లో నిర్వహించిన యూజీ (బిఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ), పీజీ (ఏంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పరీక్ష ఫలితాలను https://www.dravidianuniversity.ac.in/లో చూసుకోవచ్చని సూచించారు.

News July 26, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 16-18 గంటల సమయం పడుతుందని సమాచారం. కంపార్ట్మెంట్లన్నీ నిండి టీబీసీ సర్కిల్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 61,698 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,082 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.3.55 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు శుక్రవారం తెలిపారు.