EastGodavari

News December 17, 2025

తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్‌లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.

News December 16, 2025

తూ.గో: TDP జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు వెంకట రమణ చౌదరి?

image

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజానగరం నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి, ప్రస్తుత ‘రుడా’ అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఏడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని ఆయనకు అధిష్ఠానం కేటాయించింది. రాజానగరం స్థానం జనసేనకు కేటాయించడంతో, రమణ చౌదరి ఈ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. వెంకట రమణ చౌదరి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.

News December 16, 2025

విద్యుత్‌.. అమూల్య సంపద: కలెక్టర్‌

image

జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా రాజమండ్రి కలెక్టరేట్‌లో మంగళవారం తూర్పు గోదావరి కలెక్టర్‌ కీర్తి చేకూరి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్‌ను కేవలం ప్రకృతి వనరుగా కాకుండా, అమూల్యమైన సంపదగా భావించాలని ప్రజలకు ఆమె హితవు పలికారు. అవసరమైన మేరకే వినియోగిస్తూ, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

News December 16, 2025

గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

image

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్‌ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్‌ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

News December 15, 2025

రాజమండ్రి: పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 15, 2025

తూ.గో: రబీ యూరియా సరఫరాకు ప్రణాళిక సిద్ధం

image

జిల్లాలో రబీ సీజన్ (2025–26) పంటలకు అవసరమైన యూరియా సరఫరాకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు తెలిపారు. ఈ సీజన్‌కు 58.95 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, డిసెంబర్ 1 నాటికి 3.40 వేల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వ అందుబాటులో ఉందని సోమవారం వెల్లడించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ చేపడతామని పేర్కొన్నారు.

News December 15, 2025

తూ.గో: కల్లు అమ్మకాలు నిలిపివేయించిన ఎమ్మెల్యే.. అసలేం జరిగిందంటే..!

image

ఆధ్యాత్మిక స్థలాల్లో ధార్మిక ఆచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. ఏవీఏ రోడ్డులోని జీవకారుణ్య సంఘ స్థలంలో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ చొల్లంగి ఏడుకొండలు కల్లు విక్రయాలు సాగిస్తున్నట్లు తెలియడంతో అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి వాటిని నిలిపివేయించారు. పవిత్రమైన ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేయడం తగదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది హెచ్చరించారు.

News December 15, 2025

రాజమండ్రి: రేపటి నుంచి ఉర్దూ స్వర్ణోత్సవ వారోత్సవాలు

image

ఉర్దూ అకాడమీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ఉర్దూ అకాడమీ ప్రతినిధి నస్రీన్ ఫాతిమాతో కలిసి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందరూ వీటిని విజయవంతం చేయాలని కోరారు.

News December 15, 2025

తూ.గో: పాత నేరస్థుల ఇళ్లపై పోలీసుల నిఘా

image

తూ.గో జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 68 నంబర్, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. 30 మంది పాత నేరస్థుల ఇళ్లను తనిఖీ చేశామన్నారు.

News December 15, 2025

తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

image

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్‌ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్‌ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.