EastGodavari

News June 28, 2024

మంత్రి వాసంశెట్టి సుభాష్ అసహనం

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లను మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతులు, భోజన నాణ్యత, శానిటేషన్ తదితర అంశాలను పరిశీలించారు. వివిధ రికార్డులను తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగారు. సరైన ప్రమాణాలు పాటించడం లేదని గ్రహించి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే తీరు మార్చుకోవాలని ఆదేశించారు.

News June 28, 2024

తూ.గో.: మంత్రి లోకేశ్‌ను కలిసిన జడ్పీ మాజీ ఛైర్మన్

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీఛైర్మన్ నామన రాంబాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు డొక్కా నాగబాబు ఉన్నారు.

News June 28, 2024

తూ.గో: గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం

image

కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం భారీగా రావడంతో గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో గురువారం నుంచి పాపికొండల విహారయాత్రకు వేళ్లే బోట్లను నిలపుదల చేశారు. దీనికి తోడు తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశమున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. తాత్కాలికంగా పాపికొండల యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

News June 28, 2024

ఇంట్లోకి బాణసంచా విసిరారని ZPTC ఫిర్యాదు

image

తమ ఇంటిపై బాణసంచాతో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారంటూ ప్రత్తిపాడు జడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజేశ్వరి, ఆమె అత్త బెహరా అన్నపూర్ణ వేరువేరుగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బుధవారం రాత్రి ఈ ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోకి గాజు సీసాలు, కోడిగుడ్లు, బాణసంచా విసిరారని చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్సై పవన్ కుమార్ గురువారం తెలిపారు.

News June 28, 2024

తూ.గో: లస్కర్ల నియామకానికి ప్రతిపాదనలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో జల వనరుల శాఖకు సంబంధించి వివిధ డివిజన్లకు 681 మంది ఔట్ సోర్సింగ్ లస్కర్ల నియామకానికి గురువారం ప్రతిపాదనలు పంపించారు. తూర్పు డెల్టా (రామచంద్రపురం)లో 92, మధ్య డెల్టా (అమలాపురం) 125, డ్రైనేజీ డివిజన్ (కాకినాడ) 37, వైఐ డివిజన్ (పెద్దాపురం) 60, హెడ్ వర్క్స్ డివిజన్ (ధవళేశ్వరం) 139, పశ్చిమ డెల్టా (నిడదవోలు) 208, డ్రైనేజీ డివిజన్ (భీమవరం) 20 మంది నియామకానికి ప్రతిపాదన పంపించారు.

News June 28, 2024

ఫోన్ తీశాడని ఆరోపణలు.. గడ్డి మందు తాగిన బీటెక్ స్టూడెంట్

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో బీటెక్ విద్యార్థి గడ్డి మందు తాగాడు. SI పవన్ వివరాల ప్రకారం.. శివగంగాధర్ అనే యువకుడు చేబ్రోలులోని కాలేజ్‌లో బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు. కాలేజ్‌లో ఫోన్ పోగా.. శివ తీశాడని ఆరోపిస్తూ ఇంటికి పంపేశారు. అలాగే ఎస్సైనంటూ సీనియర్లు శివను కొట్టారని, అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని అతడి మామ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 28, 2024

రాజమండ్రి: నా సర్వీస్‌లో మరుపురాని ఘట్టం: IAS మాధవీలత

image

తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన రెండేళ్ల రెండు నెలల కాలం తన సర్వీస్‌లో మరుపురాని ఘట్టం అని IAS డా.మాధవీలత అన్నారు. జిల్లా నుంచి రిలీవ్ అయిన ఆమెకు గురువారం స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో అధికారులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్, జేసీ తేజ్ భరత్, సబ్‌కలెక్ట ర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, సిబ్బంది తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.

News June 27, 2024

మామిడికుదురు: దుర్ఘటనకు 10 ఏళ్లు..22 మంది అగ్నికి ఆహుతి 

image

మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైపు లైన్ విస్ఫోటనం జరిగి పదేళ్లు కావస్తున్నా నాటి భయానక వాతావరణం నగరం దీవి వాసులను కలవర పెడుతోంది. 2014 జూన్ 27వ తేదీన గెయిల్ ట్రంక్ పైప్ లైన్ పేలుడు జరిగి 22 మంది మృత్యువాత పడగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలు గృహాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. 

News June 27, 2024

రావులపాలెం: కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా ప్రమోషన్

image

రావులపాలెం పట్టణం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్  వైకుంఠరావుకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. 1990లో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన 34 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకోగా ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా సీఐ జేమ్స్ రత్నప్రసాద్, ఇతర సిబ్బంది వైకుంఠరావును అభినందించారు. ఇప్పటివరకు ఆయన సర్వీసులో ఎటువంటి రిమార్క్ లేకుండా పని చేశారని కొనియాడారు.

News June 27, 2024

తూ.గో: రవాణా శాఖకు రూ.275 కోట్లు ఆదాయం

image

తూర్పు గోదావరి జిల్లాలో వివిధ పన్నులు, ఫీజులు, అపరాధ రుసుముల రూపేనా గత ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.275 కోట్ల ఆదాయం వచ్చింది. వాహన జీవిత కాల పన్నులుగా రూ.113 కోట్లు, క్వార్టర్లీ పన్నులుగా రూ.35 కోట్లు, ఫీజుల రూపేనా రూ.11 కోట్లు, సర్వీస్ ఛార్జీలుగా రూ.27 కోట్లు, వాహన తనిఖీల ద్వారా అపరాధ రుసుము రూపేన రూ.89 కోట్లు ఆదాయం వచ్చిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.