EastGodavari

News October 1, 2024

తూ.గో: కొండ వాగులో బాలుడి మృతదేహం లభ్యం

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిగా వాగు నీటిలో తేలడం చూసి ఆ తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. తూ.గో జిల్లా సీతానగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వినయ్(15) కొండ గోదావరి వాగులో ఆదివారం <<14229819>>గల్లంతైన విషయం<<>> తెలిసిందే. గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహం లభ్యమైంది. స్నేహితులతో కలిసి సరదాగా ఫొటోషూట్‌కి వెళ్లిన కొడుకు శవమై ఇంటికి రావడంతో తల్లి వరలక్ష్మి, తండ్రి శ్రీనివాస్ బోరున విలపించారు.

News October 1, 2024

లబ్ధిదారులందరికీ సకాలంలో పెన్షన్ల పంపిణీ: మంత్రి దుర్గేష్

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు సకాలంలో ఇండ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను అందిస్తున్నామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో మంగళవారం ఉదయం సచివాలయ సిబ్బంది నిర్వహించిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా లబ్ధిదారులకు ఆయన పెన్షన్ల సొమ్మును అందజేశారు.

News October 1, 2024

కోనసీమ: మహిళ ఫిర్యాదు.. మాజీ MPTC అరెస్ట్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట రూరల్ మండలానికి చెందిన మాజీ MPTC, RBK ఛైర్మన్ చందర్రావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI సురేష్‌బాబు సోమవారం తెలిపారు. మాజీ MPTC చందర్రావు తనను దుర్భాషలాడుతూ కొట్టాడని కేశవరానికి చెందిన మంగాదేవి గత నెల 20వ తేదీన ఫిర్యాదు చేసినట్లు SI పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చందర్రావును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.

News September 30, 2024

కాకినాడ: ‘అమ్మ నన్ను ట్రైన్ ఎక్కించి వాటర్ కోసం వెళ్లి రాలేదు’

image

బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ఓ తల్లి వాటర్ బాటిల్ కోసం దిగగా.. ఆమె 14ఏళ్ల కుమార్తె కాకినాడకు చేరింది. RPF పోలీసులు కాకినాడలో ఆ బాలికను గమనించి వివరాలు సేకరించారు. ‘బెంగళూరు వైట్‌ఫీల్డ్ స్టేషన్‌లో అమ్మ నన్ను రైలు ఎక్కించి వాటర్ బాటిల్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఈ లోగా రైలు కదలడంతో కాకినాడ చేరా’నని పేర్కొంది. బాలిక వివరాలు చెప్పలేకపోతుందని, సఖీ, చైల్డ్‌ హెల్ప్‌లైన్ అధికారులకు అప్పగించామని తెలిపారు.

News September 30, 2024

తూ.గో: ఫొటోషూట్‌.. వాగులో గల్లంతైన విద్యార్థి

image

ఫ్రెండ్స్‌తో సరదాగా ఫొటోషూట్‌కు వెళ్లిన ఓ విద్యార్థి వాగులో గల్లంతయ్యాడు. ఈ ఘటన తూ.గో జిల్లా సీతానగరంలో జరిగింది. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. సీతానగరానికి చెందిన వి.వినయ్(15) రఘుదేవపురంలోని ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌‌లపై ఫొటోషూట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వినయ్ వాగులో గల్లంతు కాగా.. రాత్రి 9 గంటల వరకు గాలించినా అతడి ఆచూకీ లభించలేదు.

News September 29, 2024

కాకినాడ వాసి ఫిర్యాదు.. యాపిల్ సంస్థకు రూ.లక్ష ఫైన్

image

ప్రముఖ మొబైల్ సంస్థ ‘యాపిల్’కు కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష ఫైన్ విధించింది. కాకినాడలోని సూర్యారావుపేటకు చెందిన పద్మరాజు 2021 OCT 13న రూ.85,800లకు యాపిల్ ఫోన్ కొన్నారు. ఫోన్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అని ప్రకటించిన సంస్థ.. తనకు ఫోన్ పంపి, ఇయర్ పాడ్స్ ఇవ్వలేదని పద్మరాజు పలుమార్లు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో ఆయన 2022లో కమిషన్‌ను ఆశ్రయించగా.. శనివారం తీర్పు వెలువడింది.

News September 29, 2024

మార్కెట్‌లో షాక్ ఇస్తున్న ‘కొత్తిమీర’ ధరలు

image

ఏ కూరైనా సరే ఘుమఘుమలాడాలంటే చివరలో కాస్తంత ‘కొత్తిమీర’ పడాల్సిందే. అయితే.. ప్రస్తుత ధర చూసి సామాన్యులు కొత్తమీర కట్ట కొనాలంటేనే జంకుతున్నారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో కొన్ని చోట్ల ఒక్కో కట్ట ధర రూ.50 ఉండగా.. కిలో రూ.300పైనే ఉంది. ఇదొక్కటే కాదు ఆకుకూరల రేట్లన్నీ అదే రేంజ్‌లో ఉన్నాయి. ఇటీవలి వర్షాల దెబ్బకు ఆకుకూరల పంటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గి రేట్లు భగ్గుమంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

News September 29, 2024

కోనసీమ: ప్రముఖ రచయిత్రి కన్నుమూత

image

ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విజయభారతి శనివారం కన్నుమూశారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన ఈమె.. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జా తారకం సతీమణి. 20పైగా పుస్తకాలు రాసి ఎన్నో పురస్కారాలు పొందారు. ఈమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం TG నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. విజయభారతి పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్‌కి ఆదివారం అందజేయనున్నారు.

News September 29, 2024

TDP ఉభయ గోదావరి జిల్లాల MLC అభ్యర్థి ఖరారు..?

image

TDP ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. కాపు లేదా SC సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి జవహర్‌‌తో పాటు పలువురి పేర్లు పరిశీలించినా, చివరికి ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐ.పోలవరానికి చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ ఆశించగా జనసేనకు ఇచ్చారు.

News September 28, 2024

రాజమండ్రి: చిరుత కనిపించలేదు: DFO

image

కడియం మండలం బుర్రిలంక పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు ఇంకా గుర్తించలేదని, పాదముద్రలు కూడా కనిపించలేదని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి శనివారం తెలిపారు. దివాన్ చెరువు ప్రాంతంలో కూడా ఏ విధమైన సమాచారం లభించలేదన్నారు. బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉన్న నేపథ్యంలో చిరుత అటు వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆ ప్రాంతాల్లో గాలిస్తామన్నారు.