Guntur

News May 4, 2024

గుంటూరు జిల్లాలో 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

image

గుంటూరు జిల్లాలో మే 13 న జరగనున్న ఎన్నికలకు 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ మేరకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని,1309 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ లో శుక్రవారం ఈవీఎంల అదనపు కేటాయింపు ప్రక్రియపై పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు . అందులో భాగంగా వివరాలు వెల్లడించారు.

News May 4, 2024

గుంటూరులో ఈ నెల 5న నీట్ పరీక్ష 

image

వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ పరీక్ష ఈనెల 5న ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షకు 4,089 మంది విద్యార్థులు హాజరవుతుండగా, గుంటూరులో 7 పొన్నూరులో ఒక కేంద్రంలో పరీక్ష జరగనుంది. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుందని, మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు. 

News May 4, 2024

గుంటూరు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు

image

జిల్లాలో శుక్రవారం ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమ పరిధిలో రూ.2 లక్షలు, తాడికొండ పరిధిలో రూ.1,28,500ల నగదు సీజ్ చేశామన్నారు. గుంటూరు తూర్పు పరిధిలో 3.75లీటర్ల మద్యం, తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.70,300ల నగదు జప్తు చేశామన్నారు. జిల్లాలో మే 3వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,79,46,507ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు.

News May 4, 2024

గుంటూరు: గిరిజన గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం

image

తెనాలి, గుంటూరులో నడుస్తున్న మూడు ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర, బాలికల గురుకులాల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బండి విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 9 వ తరగతి వరకు గురుకులాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు గురుకులాల్లో సంప్రదించాలన్నారు.

News May 4, 2024

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: బాపట్ల కలెక్టర్ 

image

బాపట్ల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బాపట్ల జిల్లా ఎన్నికల పరిశీలకులు పరిమళ సింగ్ చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఎస్పీతో కలిసి భారత ఎన్నికల కమిషనర్ నితీశ్ వియాస్‌తో వీక్షణ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలుమార్లు సమీక్షించామని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పరిశీలకులను నియమించామన్నారు.

News May 3, 2024

గుంటూరు: పంపిణీకి సిద్ధమైన పోస్టల్ బ్యాలెట్‌లు

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్లు పంపిణీకి సిద్ధం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పత్రాలను ఇతర జిల్లాలకు, జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాల పంపిణీకి సిద్ధం చేస్తున్న ప్రక్రియను గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. నోడల్ అధికారులు శ్యాంసుందర్, రఘు పాల్గొన్నారు.

News May 3, 2024

1309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్: గుంటూరు కలెక్టర్

image

గుంటూరు జిల్లాలోని 1915 పోలింగ్ కేంద్రాలకు గాను 1309 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ తన కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంల రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.

News May 3, 2024

గుంటూరులో వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

గుంటూరు వ్యక్తి మృతిపై శుక్రవారం లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిన్నా టవర్ సెంటర్ దగ్గర్లోని లక్ష్మీ తులసి మెడికల్ షాప్ దగ్గర సుమారు 45 ఏళ్ల వయస్సు గల మగ వ్యక్తి ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గుంటూరు GGHకు తరలించగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే  చనిపోయినట్లు నిర్ధారించారు. అతని వివరాలు తెలియరాలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News May 3, 2024

పవన్‌ కళ్యాణ్ పొన్నూరు పర్యటనలో మార్పులు

image

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పొన్నూరు పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 5న పవన్ ఉదయం 10 గంటలకు, హెలికాప్టర్‌లో పొన్నూరులోని సజ్జ ఫంక్షన్ హాల్ ఎదురు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఐలాండ్ సెంటర్‌లో ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద 11 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 12 గంటలకు పవన్ తిరుగు పయనమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News May 3, 2024

మంగళగిరి: బ్యాంక్ వద్ద తోపులాట.. గాయాలు

image

పెన్షన్ నగదు తీసుకునేందుకు బ్యాంక్‌ల వద్ద వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మంగళగిరి యూనియన్ బ్యాంకు వద్ద పెన్షన్ తీసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో ఫించనుదారులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పెన్షన్ దారులకు మధ్య తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో వృద్ధురాలికి గాయాలు అయ్యాయి.