Guntur

News October 11, 2024

BJP గుంటూరు జిల్లా అధ్యక్షుడి రాజీనామా ఆమోదం

image

BJP గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రతో పాటు మీడియా ప్యానలిస్ట్ పాలిబండ్ల రామకృష్ణ రాజీనామా చేశారు. మహిళలతో అసభ్యకరంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో కథనాలు రావడంతో బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి నరేంద్ర రాజీనామా చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామాను రాష్ట్ర పార్టీ శాఖ వెంటనే ఆమోదించింది. ఇక సుకన్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

News October 11, 2024

ఆలపాటిని అఖండ మెజార్టీతో గెలిపించాలి: లావు, ప్రత్తిపాటి

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. గురువారం చిలకలూరిపేటలోని టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. 120 రోజుల్లోనే దేశంలో ఎక్కడా జరగని విధంగా పనులు చేశామని యువతకు చెప్పిమరీ ఓట్లు అడగాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులంతా ఓటు నమోదయ్యేలా చూడాలన్నారు.

News October 10, 2024

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా గాదె మధుసూదన్

image

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాపట్లకు చెందిన మాజీ మంత్రి తనయుడు గాదె మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన మధుసూదన్ రెడ్డి బాపట్ల జిల్లాలో వైసీపీకి కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నూతన కమిటీలలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 10, 2024

గుంటూరు : విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో పీజీ, డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులు(సెమిస్టర్ బేస్డ్) చదివే విద్యార్థులు అక్టోబర్‌లో రాయాల్సిన పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. http://anucde.info/halltickets.php అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

News October 10, 2024

అమరావతి: రతన్ టాటా మృతిపై సీఎం, మంత్రి మండలి సంతాపం

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతిపై సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రి మండలి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు గురువారం రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టాటా మృతి ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

News October 10, 2024

నందిగం సురేశ్ ఫిర్యాదు.. కలెక్టర్‌కు నోటీసులు

image

తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మాజీ ఎంపీ నందిగం సురేశ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సురేశ్ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ గుంటూరు కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, మర్డర్ కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు.

News October 10, 2024

ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ ఆరోగ్య మిషన్ గుంటూరు విభాగంలో ఉద్యోగాల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి విజయలక్ష్మి బుధవారం తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శానిటరీ అటెండర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను DMHO కార్యాలయంలో అందజేయాల్సిందిగా పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.guntur.ap.gov.inలో చూడాలన్నారు.

News October 10, 2024

ఈ నెల 14 నుంచి పల్లె పండుగ: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పల్లెపండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆమె అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులను శంకుస్థాపనలు చేయాలన్నారు.

News October 10, 2024

గుంటూరులో జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం పర్యటన

image

కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన సాధారణ పర్యవేక్షణ 2024-2025 సంవత్సరానికి(దశ-1) నిర్వహించటానికి జాతీయస్థాయి పర్యవేక్షకులు బుధవారం గుంటూరు జిల్లాకు విచ్చేశారు. ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సూర్యకాంత, కలెక్టర్ నాగలక్ష్మిని కలిశారు. అనంతరం కలెక్టర్, డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

News October 10, 2024

T20 క్రికెట్ టోర్నమెంట్‌లో మంగళగిరి అమ్మాయి

image

ఈ నెల 17 నుంచి బరోడా వేదికగా జరిగే ఇండియా సీనియర్ మహిళా T20 టోర్నమెంట్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ మహిళ క్రికెట్ టీంలో మంగళగిరికి చెందిన వాసవి అఖిల పావనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. గత నెల సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఢిల్లీలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ఐపీఎల్ టీం సెలక్షన్ ట్రైల్‌కి హాజరయ్యారు. మంగళగిరి నుంచి ఎంపికైన మొదటి మహిళా క్రికెట్ క్రీడాకారిణి పావనికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.