Guntur

News March 22, 2024

చేబ్రోలులో 37 మంది వాలంటీర్ల తొలగింపు

image

చేబ్రోలు మండలంలోని వివిధ గ్రామ సచివాలయాలకు చెందిన 37 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీఓవో కె.జ్యోతి ఆదేశాలు జారీ చేశారు. వీరంతా ఒక సమావేశానికి హాజరయ్యారని ఆమె తెలిపారు. అనంతరం చేబ్రోలు-1 గ్రామ సచివాలయంకు చెందిన ముగ్గురు, చేబ్రోలు-2కు చెందిన 7గురు, చేబ్రోలు-3కు చెందిన 4గురు, చేబ్రోలు-4కు చెందిన 6గురు, చేబ్రోలు-5కు చెందిన 14మందిని విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. 

News March 22, 2024

ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రం కేటాయించాలి: కలెక్టర్ 

image

ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రంలో పూర్తిగా విభిన్న ప్రతిభావంతులనే నియమించాలని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధులు కేటాయిస్తామన్నారు. ఉద్యోగుల వివరాలు ఎన్ఐసీ పోర్టల్లో నమోదు చేసిన అనంతరం అధికారులు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు.

News March 22, 2024

గుంటూరు: స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. కామన్ వెరైటీ సగటు ధర రూ.500, స్పెషల్ వెరైటీ సగటు ధర రూ.1,000 మేరకు పెరిగింది. రైతులు గురువారం 1,06,381 బస్తాలు యార్డుకు తరలించారు. 1,04,332 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 81,360 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ వెరైటీలో 334, 273రకాల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు. 

News March 22, 2024

అనధికారిక లావాదేవీలపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలి: గుంటూరు కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా అధిక మొత్తంలో జరిగే లావాదేవీల ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎలక్షన్ కోడ్ అమలుపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల ఖర్చుకు అనుమతి ఉందన్నారు.

News March 21, 2024

రేపు లా సెట్ నోటిఫికేషన్ విడుదల

image

ఏపీలో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బి.సత్యనారాయణ తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలోని లాసెట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, వీసీతో కలిసి నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు.

News March 21, 2024

నరసరావుపేటలో గోపిరెడ్డిదే రికార్డ్ మెజార్టీ

image

నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 1952 నుంచి 15 సార్లు ఎన్నికల జరిగాయి. గత ఎన్నికల్లో గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిదే ఇప్పటి వరకు భారీ మెజార్టీ. టీడీపీ అభ్యర్థిపై ఆయన 32,277 ఓట్ల మెజార్టీతో 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు(1985)ది అత్యల్ప మెజార్టీ 2,065. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి గోపిరెడ్డి బరిలో ఉండగా, TDP కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

News March 21, 2024

గుంటూరులో విషాదం.. లిఫ్ట్ గుంతలో పడి చిన్నారి మృతి

image

గుంటూరు రూరల్ మండలం పెద్దపలకలూరు గ్రామపంచాయతీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ కోసం తీసిన గుంతలో పడి చిన్నారి మృతిచెందింది. ఓ ప్రైవేట్ కాలేజీ సమీపంలోని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ఆరేళ్ల కుమార్తె గుంతలో పడి చనిపోగా, నల్లపాడు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న వారు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబానిది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఓ గ్రామం. 

News March 21, 2024

పొన్నూరు: కోడిపందేల స్థావరాలపై దాడులు.. 14 మంది అరెస్ట్

image

పొన్నూరు మండలం మాచవరం గ్రామం తుంగభద్ర డ్రెయిన్ కట్టపై గురువారం పొన్నూరు రూరల్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై బండ్ల భార్గవ్ ఆధ్వర్యంలో కోడి పందేల స్థావరాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, 6 కోడిపుంజులతో పాటు 16 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్సై భార్గవ్ మీడియాకు తెలిపారు.

News March 21, 2024

ఉగాది పురస్కారానికి పల్నాడు ఏఆర్ అడిషనల్ SP ఎంపిక

image

ఉగాది పురస్కారాలకు పల్నాడు జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్ర రాజు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేస్తుంది. ఈ క్రమంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి సిఫారసు మేరకు ఉత్తమ సేవలు అందించిన రామచంద్ర రాజుకు ప్రభుత్వం 2024 ఉత్తమ సేవా పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా బుధవారం అధికారులు, సిబ్బంది ఆయన్ను అభినందించారు.

News March 21, 2024

దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలి : టీడీపీ

image

ప్రత్తిపాడు అసెంబ్లీ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రామాంజనేయులుపై దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు గురువారం గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కావాలని వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని వివరించారు.