Guntur

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. గుంటూరు జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం గుంటూరు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

ఓటమి భయంతోనే పోస్టల్ బ్యాలెట్‌పై వైసీపీ వివాదం: ప్రత్తిపాటి

image

ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పోస్టల్ బ్యాలెట్‌పై వివాదాల రేపేందుకు తంటాలు పడుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎంత తలకిందులుగా తపస్సు చేసినా వారి దింపుడుకళ్లెం ఆశలు ఫలించవని, ఆ పార్టీ ఓటమి పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభం కానుందన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు శాశ్వతంగా దూరమైపోయిందన్నారు.

News June 1, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బాధ్యతగా లెక్కించండి: కలెక్టర్

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లెక్కింపు చేయాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా, సత్వరమే చేయడం కోసం సహాయకంగా నియమించిన ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలన్నారు.

News May 31, 2024

అవాంఛనీయ ఘటనలను ఆదిలోనే కట్టడి చేయాలి: ఎస్పీ వకుల్ జిందాల్

image

కౌంటింగ్ రోజు ఏర్పడే అవాంఛనీయ ఘటనలను ఆదిలోనే కట్టడి చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 5 డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News May 31, 2024

జస్టిస్ ఏపీ శేష సాయి సేవలు ప్రసంశనీయం: చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

image

ఏపీ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవీ శేష సాయి అందించిన సేవలు ప్రసంశనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నశేష సాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.

News May 31, 2024

గుంటూరులో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. బ్రాడీపేట 2/17 రోడ్డుపై మద్యం మత్తులో ఓ వ్యక్తి పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ తెలిపారు.

News May 31, 2024

చిలకలూరిపేట వద్ద రెండు లారీలు ఢీ

image

చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాతపూడి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ భోగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

పల్నాడులో షాపులు బంద్.. ఎప్పటినుంచంటే..!

image

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు జూన్ 2,3,4,5 తేదీలలో షాపులు పూర్తిగా మూసి వేయనున్నట్లు, నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరి కిషోర్ బాబు తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్థులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. శనివారం ఐదు గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అనంతరం షాపులు మూసి వేయవలసిందిగా కిషోర్ కోరారు.

News May 31, 2024

గుంటూరు: కట్నం కోసం భార్యను కొరికిన భర్త పై కేసు

image

అదనపు కట్నం కోసం భార్య ఒళ్లంతా కొరికేసిన వైనం పెనమలూరు PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీకి, కానూరు సనత్‌నగర్‌కు చెందిన షేక్‌ ముస్కాన్‌కు ఏడాది కింద వివాహమైంది. వివాహమైన మూడు నెలల తర్వాత చెడు వ్యసనాలకు అలవాటైన భర్త అదనపు కట్నం తేవాలంటూ భార్య ఒళ్లు కొరికేయడం, కొట్టడం చేస్తుండడంతో పుట్టింటికి వెళ్లి గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 31, 2024

గుంటూరు: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తులు

image

అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు ఆన్లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెంది పదో తరగతి విద్యార్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్సైట్ ద్వారా జూన్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తాత్కాలిక అడ్మిట్ కార్డు పొందిన అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటారన్నారు.