Krishna

News September 7, 2024

ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు వీరివే..?

image

ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్ల యజమానులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ పడవలు గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‍కు చెందినవిగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రభుత్వ సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు విజయవాడ వన్‌ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. యజమానుల గుర్తింపుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News September 7, 2024

వారిని పునరావాస శిబిరాలకు తరలించండి: కలెక్టర్ జి.సృజన

image

విజయవాడ పరిసరాల్లోని పల్లపు ప్రాంతాల్లోని వారిని చీకటిపడేలోగా పునరావాస శిబిరాలకు తరలించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో వారికి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆమె సూచించారు. శనివారం కలెక్టర్ జి.సృజన, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జలదిగ్బంధంలోనే ఉన్న జక్కంపూడి కాలనీ, అంబాపురం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

News September 7, 2024

2 రోజుల్లోనే పూర్తయిన గేట్ల మరమ్మతులు

image

ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను శనివారం మధ్యాహ్నం నాటికి విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నదిలో లక్షన్నర క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి గేట్లు అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు.

News September 7, 2024

లక్షకు పైగా మెడికల్ కిట్లు పంపిణీ చేశాం: మంత్రి సత్యకుమార్

image

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలోని 32 వార్డు సచివాలయాల్లో 184 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, ఆరు రకాల మందులతో కూడిన లక్షకు పైగా మెడికల్ కిట్లను ఇప్పటికే పంపిణీ చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ మెడికల్ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా కూడా పంపిణీ చేస్తామన్నారు. ఎల్లుండి నుంచి మూడు రోజులపాటు డోర్ టు డోర్ మెడికల్ సర్వే నిర్వహిస్తామని చెప్పారు.

News September 7, 2024

విశాఖ రైల్ నీర్ ప్లాంట్ నుంచి విజయవాడకు తాగునీరు అందించాలి: YS షర్మిల

image

విశాఖ రైల్ నీర్ ప్లాంట్ నుంచి విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలకు తాగునీరు అందించాలని PCC చీఫ్ YS షర్మిల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం లేఖ రాశారు. వరదల కారణంగా విజయవాడ మున్సిపాలిటీ నుంచి తాగునీరు ఇవ్వాలంటే చాలా సమయం పడుతుందని, ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం నుంచి నీరు ఇవ్వాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.

News September 7, 2024

BREAKING: బుడమేరు మూడో గండి పూడ్చివేత

image

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద బుడమేరుకు పడిన 90మీటర్ల మూడో గండిని పూడ్చేశారు. నాలుగు రోజులుగా గండి పనులను నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నానికి గండి పూడ్చే పనులు పూర్తయ్యాయి. గండిని పూడ్చడానికి ఆర్మీసైతం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

News September 7, 2024

ఊటుకూరులో పట్టపగలే దారుణ హత్య

image

ముదినేపల్లి మండలం ఊటుకూరులో శనివారం పట్టపగలే దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన పోసిన బాల కోటయ్య (55)ను మారణాయుధాలతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ముదినేపల్లి పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

News September 7, 2024

పరువు నష్టం కింద రూ.50 కోట్లు చెల్లించండి: ముంబై నటి

image

విజయవాడ కేంద్రంగా ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలకు ఆమె లీగల్ నోటీసులిచ్చారు. ఈ మేరకు ఆమె తన తరపు లాయర్ నర్రా శ్రీనివాసరావు ద్వారా నోటీసులు పంపారు. పరువు నష్టం కింద రూ.50 కోట్లు, న్యాయఖర్చుల నిమిత్తం రూ.35 లక్షలు ఇవ్వాలని ఆమె సదరు సంస్థలను డిమాండ్ చేశారు.

News September 7, 2024

బుడమేరు గండి పూడ్చేందుకు వినియోగిస్తున్న సామాగ్రి ఇదే..

image

విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండి పూడ్చివేతకు ఆర్మీ సిబ్బంది శుక్రవారం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. విపత్కర సమయంలో సైన్యం ఉపయోగించే గేబియాన్‌ బుట్టల ద్వారా గండ్లు పూడ్చేందుకు కావాల్సిన పరికరాలను యుద్ధప్రాతిపదికన సైన్యం సిద్ధం చేసుకుంది. ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపడం ద్వారా గండి పూడ్చాలని నిర్ణయించినట్లు సమాచారం.

News September 7, 2024

విజయవాడ: ముమ్మరంగా సాగుతున్న న్యూట్రిషన్ కిట్ల ప్యాకింగ్

image

వరద బాధితులకు అందజేసే న్యూట్రిషన్ కిట్ల ప్యాకింగ్ విజయవాడలో ముమ్మరంగా సాగుతోంది. అమ్మ కళ్యాణ మండపం, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ఈ ప్యాకింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ఈ కిట్‌లో ముంపు ప్రాంతాల్లో ఇచ్చేందుకు ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్ ప్యాకెట్లు, రెండు లీటర్ల పాల ప్యాకెట్లు, మూడు నూడిల్స్ ప్యాకెట్లు, రెండు లీటర్ల వాటర్ బాటిళ్ళు ఉంటాయని పేర్కొంది.

error: Content is protected !!