India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగ్గయ్యపేట పరిధి బూదవాడలోని సిమెంట్ ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన ఐదుగురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి, విషమంగా ఉందని DMHO సుహాసిని తెలిపారు. తీవ్రగాయాలైన అర్జున్, గుగులోతు స్వామి, గోపి, సైదా, శ్రీమన్నారాయణలకు ప్రస్తుతం చికిత్స అందుతోందని ఆమె తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారిలో 10 మంది కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కార్మికులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు మరికొద్దిసేపట్లో అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు. పోలవరం కుడి కాలువ (పట్టిసీమ) ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదికి చేరుకోవటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.01 అడుగుల మేర నీటి నిల్వలు చేరాయి. దీంతో గోదావరి జలాలను మరికాసేపట్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర విడుదల చేయనున్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు మంగళగిరి గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
రాష్ట్రానికి చెందిన బాస్కెట్ బాల్ ఆటగాడు కె ద్వారకానాథ్ రెడ్డి సౌత్ ఏషియన్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఆడే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు రాష్ట్ర బాస్కెట్ బాల్ సంఘ ప్రధాన కార్యదర్శి జి చక్రవర్తి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. కొలంబోలో (శ్రీలంక) నేటి నుంచి 13వ తేదీ వరకు జరిగే సౌత్ ఏషియన్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో ద్వారకానాథ్ రెడ్డి భారత్ తరఫున ఆడతారని చక్రవర్తి చెప్పారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాల పట్ల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునేలా చూడాలని, ఇందుకోసం వివిధ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం అధికారులకు సూచించారు. అగ్నివీర్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో.. వాయుసేనకు చెందిన నాన్ కమిషన్ ఆఫీసర్ సందీప్, జిల్లా ఉపాధి కల్పనాధికారి డి విక్టర్ బాబు కలెక్టర్‌కు వివరాలు తెలియజేశారు.
విజయవాడకు చెందిన అనూష భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మూడు పతకాలు కైవసం చేసుకున్నట్లు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ తెలిపారు. జులై 5 నుంచి 8 వరకు పోలాండ్‌లో జరిగిన 17వ పోలాండ్ కప్ అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అనూషను అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ముఠా మోసంపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. మోసపోయిన బాధితుడు మధుబాబుకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే కిడ్నీ రాకెట్‌పై సీరియస్‌గా వ్యవహరించాలని కోరారు. రూ.30 లక్షల ఆశ చూపి కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని బాధితుడు మధుబాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విజయవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘బొమ్మదేవర ధీరజ్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రికర్వ్ ఆర్చర్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల ఆసియా టోర్నీలో రజతంతో మెరిసిన 22 ఏళ్ల ధీరజ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 18 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని తాజాగా ఎమ్మెల్యే తెలిపారు. తిరువూరు లక్ష్మీపురం అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎవరైనా ఈ ఉచిత డీఎస్సీ శిక్షణ కోసం రావొచ్చని స్పష్టం చేశారు.
విజయవాడ, గూడూరు సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దైన రైళ్లు..
★ 07500 విజయవాడ-గూడూరు (ఈ నెల 15 నుంచి 30 వరకు)
★ 07458 గూడూరు-విజయవాడ (16 నుంచి 31 వరకు)
★ 07461 విజయవాడ-ఒంగోలు 16 నుంచి 30 వరకు)
★ 07576 ఒంగోలు-విజయవాడ 16 నుంచి 30 వరకు)
★ 12743/12744 విజయవాడ-గూడూరు (15 నుంచి 30 వరకు)
★ 17259/17260 గూడూరు-విజయవాడ (16, 23, 24, 30 తేదీల్లో)
Sorry, no posts matched your criteria.