Krishna

News July 11, 2024

వల్లభనేని వంశీపై కేసు

image

గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీతో పాటు ఆయన అనుచరులు 70 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో ఇప్పటికే 15 మందిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

News July 11, 2024

జిల్లాలో రూ.300 కోట్ల కుంభకోణం: దేవినేని ఉమా

image

రాష్ట్రంలో సెంటు పట్టా పేరుతో వేల కోట్ల రూపాయల సొమ్మును వైసీపీ నాయకులు దోచేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లో వైసీపీ నేతలు భారీ అవినీతి దందాకు తెరలేపారని దుయ్యబట్టారు. జిల్లాలో రూ.300 కోట్ల మేర కుంభకోణం జరిగిందన్నారు. పేదలకు స్థలాల కోసం భూసేకరణలో ఇష్టానుసారం రేట్లు పెంచి వైసీపీ నాయకులు పంచుకున్నారని విమర్శించారు.

News July 11, 2024

విజయవాడలో వైసీపీ కార్పొరేటర్ భర్త అరెస్ట్

image

విజయవాడ పాయకాపురంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట శిబిరంపై నున్న పోలీసులు మెరుపు దాడి చేశారు. విజయవాడ 61వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ భర్త ఉమ్మడి వెంకట్రావు జూదం ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద రూ.30,580ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 11, 2024

జోగి చుట్టూ కేసుల ఉచ్చు

image

ప్రభుత్వం జప్తు చేసిన భూములను కబ్జా చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో కొందరు అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరింత లోతైన విచారణకు DGP ఏసీబీని ఆదేశించారు. ఇప్పటివరకు విచారణలో తేలిన అంశాల మేరకు జోగిపై కేసు నమోదు చేసే అవకాశమున్నట్లు సమాచారం. అరెస్టు ముప్పూ పొంచి ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.

News July 11, 2024

విజయవాడ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం

image

విజయవాడ వన్ టౌన్ విజయ కాంప్లెక్సులోని ఫ్యాన్సీ వస్తువుల గోడౌన్లలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మూడు గోడౌన్లు మంటలకు ఆహుతయ్యాయని వ్యాపారస్తులు తెలిపారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల ఆస్తి అగ్నికి ఆహుతైనట్లు భావిస్తున్నారు.

News July 11, 2024

కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో గురువారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న గుంటూరు, బాపట్ల జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.

News July 11, 2024

బందరు పోర్టు పురోగతిపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్

image

బందరు పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రతివారం ప్రగతి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పోర్టు, జలజీవన్ మిషన్ కింద జరుగుతున్న పనులపై బుధవారం ఆయన సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. రోడ్ కం రైల్ కనెక్టివిటీకి సంబంధించి భూసేకరణపై దృష్టిసారించాలన్నారు.

News July 10, 2024

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

image

విజయవాడ వన్ టౌన్ మెయిన్‌రోడ్‌లో విజయా కాంప్లెక్స్‌లోని కృష్ణ బ్యాంగిల్స్ షాప్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫ్యాన్సీ సామగ్రి, పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణ బ్యాంగిల్స్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

News July 10, 2024

కృష్ణా: రేపు త్రిబుల్ ఐటీ అభ్యర్థుల జాబితా విడుదల

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలకు సంబంధించిన అడ్మిషన్లలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈనెల 11న ఉదయం 11 గంటలకు ఛాన్సలర్ ఆచార్య కేసిరెడ్డి విడుదల చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ వర్గాలు తెలిపాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.

News July 10, 2024

హజ్ యాత్రికులకు ఘనస్వాగతం పలికిన మంత్రి ఫరూక్

image

హజ్ యాత్రను ముగించుకొని ఏపీకి తిరిగొచ్చిన యాత్రికులకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ బుధవారం ఘనస్వాగతం పలికారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి లభించిన సహాయ సౌకర్యాలతో హజ్ యాత్ర ముగించుకుని స్వస్థలాలకు చేరుకున్నామని, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని యాత్రికులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.