Krishna

News June 5, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రులపైన అత్యధిక మెజారిటీ

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున పోటీ చేసిన మంత్రుల పైనే కూటమి అభ్యర్థులు ఎక్కువ మెజారిటీ సాధించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ చేతిలో 59,915 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు సెంట్రల్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా 68,886 ఓట్ల తేడాతో ఉమ చేతిలో ఓడిపోయారు. కాగా ఉమ్మడి కృష్ణాలో ఈ మెజార్టీలే అత్యధికం.

News June 5, 2024

విజయవాడ తూర్పులో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన గద్దె

image

1967లో ఏర్పడిన విజయవాడ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్‌లో వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఎమ్మెల్యేగా టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రికార్డ్ సృష్టించారు. 2014,19లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన గద్దె తాజా ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి దేవినేని అవినాశ్ పై 49,640 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి విజయవాడ తూర్పులో మొట్టమొదటి హ్యాట్రిక్ కొట్టిన నేతగా రికార్డ్ సృష్టించారు.

News June 5, 2024

పామర్రు: నాడు తండ్రిని ఓడించారు.. నేడు కొడుకును గెలిపించారు

image

2009లో ఏర్పడ్డ పామర్రు నియోజకవర్గంలో 2024లో తొలిసారి టీడీపీ గెలిచింది. గత 3 ఎన్నికల్లో ఇక్కడ ఓడిన టీడీపీకి తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా తొలి విజయాన్ని అందించారు. 2014లో పామర్రులో టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల కుమార్ రాజా తండ్రి రామయ్య 1,069 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు రామయ్యను ఓడించిన పామర్రు ఓటర్లు.. నేడు అతని కుమారుడు కుమార్ రాజాను 29,690 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.

News June 5, 2024

జోగి రమేశ్ ఓటమికి కారణాలు ఇవేనా!?

image

కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేశ్ ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసిన ఆయన ఈ ఎన్నికల్లో పెనమలూరు బరిలో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్‌పై పోటీ చేసి 59,915 భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గం మారడం, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడం, టీడీపీ కంచుకోట నుంచి పోటీ చేయడం జోగి రమేశ్ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

News June 5, 2024

ఉమ్మడి కృష్ణాలో కూటమి క్లీన్ స్వీప్

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 మంది MLA అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. కేశినేని చిన్నికి 2,82,085, బాలశౌరికి 2,16,938 మెజార్టీ వచ్చింది. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి 47,032 మెజార్టీతో గెలిచారు.

News June 5, 2024

మచిలీపట్నంలో పొలిటికల్ సెంటిమెంట్ రిపీట్

image

మచిలీపట్నంలో పొలిటికల్ సెంటిమెంట్ రిపీట్ అయింది. ఇక్కడ గెలుపొందిన పార్టీనే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. ఇది టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతోంది. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన బొర్రా వెంకట స్వామితో ప్రారంభమైన ఈ సెంటిమెంట్ తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలుపొందిన కొల్లు రవీంద్ర మరింత ముందుకు తీసుకువెళ్లారు.

News June 5, 2024

నాడు 25 ఓట్ల తేడాతో ఓటమి.. నేడు 68 వేల మెజారిటీ

image

విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ 2019లో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో ఉమ 68,886 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌పై గెలుపొంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో నెగ్గిన ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అంతేకాక ఉమ సాధించిన 68,886 మెజారిటీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ కావడం విశేషం.

News June 5, 2024

కృష్ణా: కూటమి ప్రభుత్వంలో వీరిద్దరికి మంత్రి పదవులు.?

image

కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులపై సర్వత్ర ఉత్కంఠ నెలపొంది. జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, మండలి బుద్ధప్రసాద్ మంత్రి పదవులు రేసులో ఉన్నారు. జిల్లా నుంచి గెలుపొందిన వారిలో వీరిద్దరు సీనియర్లు కావటంతోపాటు సామాజిక వర్గ సమీకరణాలు కూడా వీరికి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. బీసీ సామాజిక వర్గం నుంచి రవీంద్రకు, పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నుంచి గెలుపొందిన బుద్ధప్రసాద్‌కు మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

News June 5, 2024

గుడివాడ: రాజకీయ అరంగేట్రంలోనే 53 వేల మెజారిటీ

image

గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత వెనిగండ్ల రాము తాజా ఎన్నికలలో 53,040 ఓట్ల భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి కొడాలి నానిపై గెలుపొందారు. గుడివాడలో తన ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన రాము ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. రాముకు ఇవే తొలి ఎన్నికలు కాగా మొట్టమొదటి ఎన్నికలలోనే 53,040 ఓట్ల మెజారిటీతో గెలుపొంది గుడివాడ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.

News June 4, 2024

గుడివాడ: వాలంటీర్ అనిల్ ఆత్మహత్య

image

గుడివాడ నియోజవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటమిని తట్టుకోలేక, గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ అనే వాలంటీర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాలంటీర్ మృతితో గుడివాడలో విషాదం నెలకొంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.