Kurnool

News August 21, 2024

కర్నూలులో మోసగాడి అరెస్ట్‌.. ₹18 లక్షలు రికవరీ

image

డబ్బు రెట్టింపు చేస్తానని మోసానికి పాల్పడిన చిన్నసుబ్బరాయుడును కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. భాస్కర్‌ నగర్‌కు చెందిన మహమ్మూద్‌‌కు సుబ్బరాయుడు పరిచయమయ్యాడు. కొంత డబ్బిస్తే రసాయనాలతో రెట్టింపు చేస్తానని నమ్మించాడు. ఆశపడిన మహమ్మూద్‌ రూ.19.50 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఉడాయించడంతో మోసపోయానని తెలుసుకున్న మహమ్మూద్‌ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ₹18.20 లక్షలను రికవరీ చేశారు.

News August 21, 2024

శ్రీశైలం డ్యామ్ వద్ద విరిగిపడిన కొండ చరియలు

image

శ్రీశైలం డ్యామ్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో డ్యామ్ దిగువన రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇదే సమయానికి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు స్పందించి రోడ్డుపై పడ్డ రాళ్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

News August 21, 2024

కర్నూల్.. మరణంలోనూ వీడని బంధం

image

బండి ఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న చిన్న తిరుపాలు (75) ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో భార్య అక్కమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సాయంత్రం తిరుపాలును అంత్యక్రియల నిమిత్తం తీసుకెళ్తుండగా భార్య అక్కమ్మ(69) గుండెపోటుకు గురై మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

News August 21, 2024

నిధులు మంజూరు చేసినందుకు కృతఙ్ఞతలు: సీపీఐ

image

రోడ్లకు నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు, అందుకు కృషి చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణకు సీపీఐ జిల్లా సమితి నాయకులు భూపేశ్ కృతఙ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆలూరులో ఆయన మాట్లాడారు. మొలగవల్లి గ్రామం నుంచి హోసూరు మీదుగా బీటీ రోడ్‌కు రూ.1.85 కోట్లు, మొలగవల్లి నుంచి నెమలికల్లు బీటీ రోడ్డుకు రూ.9 కోట్లు ఐదేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిందన్నారు.

News August 20, 2024

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి: కలెక్టర్

image

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా లోన్ మేళాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో స్పెషల్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి మేళాలు ఏర్పాటు చేసినట్లే లోన్ మేళాను నిర్వహించాలన్నారు.

News August 20, 2024

కర్నూలు జిల్లాకు మళ్లీ వర్ష సూచన

image

కర్నూల్ జిల్లాలో నేడూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి మరోసారి కుండపోత వర్షానికి ఛాన్స్ ఉందని ట్వీట్ చేశారు. కాగా నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పత్తికొండ-ఆదోని మధ్య కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అమృతాపురంలో టోపీ మారెమ్మవ్వ ఆలయంలోకి వరద నీరు చేరింది. హంద్రీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

News August 20, 2024

నందికొట్కూరు సీఐ పోస్టింగ్ విషయంలో కోల్డ్ వార్: వైసీపీ

image

నంద్యాల జిల్లాలో పోలీసుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరుతోందని వైసీపీ విమర్శించింది. ‘నందికొట్కూరు సీఐ పోస్టింగ్ విషయంలో కోల్డ్ వార్ జరుగుతోంది. తాజాగా జూపాడుబంగ్లా ఎస్ఐ కేశవకి ఎంపీ బైరెడ్డి శబరి పోస్టింగ్ ఇప్పించారు. ఛార్జ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే కేశవను ఎమ్మెల్యే బదిలీ చేయించారు. ముచ్చుమర్రి ఎస్ఐగా మేము సూచించిన వ్యక్తినే నియమించాలని నేతల పట్టు’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

News August 20, 2024

వెలుగోడులో మిద్దె కూలి ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

image

నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో విషాదం జరిగింది. పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో మట్టి మిద్దె కూలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిద్రిస్తున్న సమయంలో రాత్రి హఠాత్తుగా మట్టి మిద్దె కూలి హనుమన్న భార్య కుమ్మరి మద్దమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందారు. హనుమన్న, కొడుకు రామాంజనేయులుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News August 20, 2024

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: డీఐజీ

image

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సూచించారు. సోమవారం కర్నూలు IIIT DM విద్యార్దులకు జరిగిన మోటివేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. విద్యార్దులు ప్రతి ఒక్కరూ ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించుకోవాలన్నారు.

News August 20, 2024

తుంగభద్ర డ్యాం.. ఇన్ ఫ్లో 31,435 క్యూసెక్కులు

image

తుంగభద్ర డ్యాం నుంచి నదికి నీటి విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 31,435 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం మొత్తం నీటి సామర్థ్యం 105.33 టీఎంసీలుకాగా ప్రస్తుతం 76.780 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం అవుట్‌ఫ్లో 10,089 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.