Kurnool

News August 13, 2024

తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన మంత్రులు

image

కర్ణాటకలోని హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌ను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కర్నూల్ ఎంపీ నాగరాజు, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై నిపుణులు, అధికారులతో చర్చించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 13, 2024

వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే

image

కర్నూలులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘ అవయవ దానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి’ అని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News August 13, 2024

తుంగభద్ర డ్యాం.. నీటి వృథా కాకుండా స్టాప్‌లాగ్‌

image

తుంగభద్ర డ్యాంలో నీరు పూర్తిగా వృథా కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హొసపేటెలో స్టాప్‌లాగ్‌ గేటును కార్మికులు సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో తయారీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటినిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన తర్వాతి నుంచి నిన్న రాత్రి 9 గంటల వరకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి.

News August 13, 2024

నంద్యాల: పిజిఆర్ఎస్‌కు 153 దరఖాస్తులు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. పిజిఆర్ఎస్‌కు 153 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు.

News August 12, 2024

తుంగభద్ర డ్యామ్‌కు కర్ణాటక సీఎం

image

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తుంగభద్ర డ్యామ్‌ను మంగళవారం సందర్శించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో గేటు మరమ్మతుల పనులు పరిశీలించనున్నారు. దీంతో అందుకు తగ్గ ఏర్పాట్లను కొప్పల్, విజయనగర జిల్లాల అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌ను ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, రామానాయుడులు పరిశీలించారు.

News August 12, 2024

కృష్ణానదిలో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

image

పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ సమీపంలోని కృష్ణా నదిలో ఆదివారం చేపల వేటకు వెళ్లి బండారు శేషన్న అనే మత్స్యకారుడు గల్లంతైన విషయం విధితమే. స్థానికులు, మత్స్యకారులు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా శేషన్న మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నందికొట్కూరుకు తరలించారు.

News August 12, 2024

ఈనెల 16 నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు

image

ఈనెల 16 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ గ్రామంలో, ఏ తేదీలో సదస్సులు నిర్వహిస్తామన్న వివరాలతో వెంటనే షెడ్యూల్ రూపొందించి పంపాలని అధికారులను ఆదేశించారు.

News August 12, 2024

చెన్నైలో ఘోర ప్రమాదం.. కర్నూలు బీటెక్ విద్యార్థి దుర్మరణం

image

కర్నూలుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రామ్మోహన్(21) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న రామ్మోహన్.. తన స్నేహితులతో కలిసి కారులో అరుణాచలేశ్వర ఆలయానికి ఆదివారం బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారును తిరువళ్లూరు జిల్లాలో లారీ ఢీకొంది. ప్రమాదంలో రామ్మోహన్‌తో పాటు మరో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు.

News August 12, 2024

వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి వృద్ధురాలి ఆత్మహత్య

image

ఆత్మకూరు పద్మావతి నగర్‌లోని పెద్ద వాటర్ ట్యాంక్‌పై నుంచి వృద్ధురాలు దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు ఆత్మకూరులోని అక్కిరాజు కాలనీకి చెందిన ఖైరన్ బీ(68)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం సరిగా లేక ఆమె ట్యాంకు నుంచి దూకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News August 12, 2024

దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట: ఎస్పీ

image

నంద్యాల జిల్లా పరిధిలో దొంగతనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా గస్తీ నిర్వహణ చేయాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో గస్తీ విధులు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, నేర చరిత్ర గల వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. వాహనాల రికార్డులను పరిశీలించాలన్నారు.