Kurnool

News July 8, 2024

నంద్యాల: అత్యాచారం కేసులో జైలు శిక్ష

image

మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన వృద్ధుడు అలంపూర్ పాపయ్య (74)కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి తెలిపారు. జూన్ 21న బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచార ప్రయత్నం చేశాడని తల్లి ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. విచారణ అనంతరం నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఎస్పీ వివరించారు.

News July 8, 2024

శ్రీశైలంలో ఆ ఐదు రోజుల స్పర్శ దర్శనం నిలుపుదల

image

శ్రావణమాసంలో ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ మల్లికార్జున స్వామి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుందని ఆయన ఈవో పెద్దిరాజు తెలిపారు. ఐదు రోజులపాటు స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులకు అనుమతి ఉండదన్నారు. నెలలో 16 రోజుల పాటు అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. వేకువజామున 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామన్నారు.

News July 8, 2024

భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రావణమాసం ఏర్పాట్లు

image

శ్రీశైలం ఆలయానికి శ్రావణమాసంలో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు. శ్రావణమాసం ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఆలయ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారికి శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

News July 8, 2024

శ్రీశైలంలో ఉద్యోగుల విధుల్లో మార్పులు

image

పరిపాలన సౌలభ్యంలో భాగంగా శ్రీశైలం దేవస్థానంలో వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను మారుస్తూ ఈవో పెద్దిరాజు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఆలయంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 50మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ.. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

News July 8, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌కు అర్జీల రూపంలో అందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

News July 8, 2024

పాప ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయండి : ఎస్ఐ జయశేఖర్

image

ఎనిమిదేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై జయశేఖర్ వివరాలు..పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి వాసంతి ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కేసు నమోదు చేసుకొని పాప కోసం గాలిస్తున్నారు. పాప ఆచూకీ తెలిసినవారు పోలీసుస్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

News July 8, 2024

కర్నూలు: వెబ్సైట్‌లో ఇసుక నిల్వల వివరాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి ఉచిత ఇసుక విధానం అమలవుతోంది. వినియోగదారులు ఇసుక సమాచారం వివరాలు https://www.mines.ap.gov.in/permit/ అనే వెబ్సైట్‌లో చూసుకోవాలని జిల్లా గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎంత నిల్వ ఉంది, తదితర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొన్నారు.

News July 8, 2024

నంద్యాల: భూ తగదా.. వేట కొడవలితో దాడి

image

డోన్ మండలం వెంకటనాయునిపల్లెలో భూ తగాదా హత్యాయత్నానికి దారి తీసింది. స్థానికుల వివరాలు.. మాదయ్యను అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు చెన్నయ్య, ఇంద్రప్ప ఆదివారం సాయంత్రం వేట కొడవలితో తలపై నరికారు. తీవ్ర గాయాలైన మాదయ్యను వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News July 8, 2024

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండండి: నంద్యాల ఎస్పీ

image

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్లు తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని మీకు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తామని ఒక యాప్ లింక్ పంపి దాంట్లో మీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని అడుగుతారని వివరాలు తెలపగానే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు మాయం చేస్తారని తెలిపారు. ఎవరైనా ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దని సూచించారు.

News July 8, 2024

నేడు కలెక్టరెట్‌లో ప్రజా ఫిర్యాదుల వేదిక: నంద్యాల కలెక్టర్ 

image

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ఈ ప్రక్రియను పీజీఆర్‌ఎస్‌ ద్వారా చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ స్థాయిలో కూడ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.