Kurnool

News July 7, 2024

ప్యాపిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్యాపిలి మండలంలో జరిగినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎర్రగుంట్లపల్లెకు చెందిన వైసీపీ నేత పోతురెడ్డి వెంకటేశ్వర రెడ్డి కుమారుడు ధీరజ్(23) స్నేహితుడు రమేశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి  వస్తుండగా పెద్దమ్మ డాబా వద్ద ఓ కారు వారిని ఢీకొంది. ధీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన రమేశ్‌ను కర్నూలుకు తరలించారు. 

News July 7, 2024

నంద్యాల కలెక్టర్‌గా రాజకుమారి బాధ్యతలు

image

నంద్యాల కలెక్టరేట్‌లో ఈ రోజు ఉదయం 11.30 గంటలకు కలెక్టర్‌గా రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. మహానంది దేవస్థానం వేదపండితులు, అర్చకులు పూజలు నిర్వహించగా.. ముస్లిం, క్రైస్తవ మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్థనల అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ పద్మజ, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

News July 7, 2024

నందికొట్కూరులో వేడేక్కిన రాజకీయం.. MLA vs బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

image

నందికొట్కూరులో TDP నేతలు పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడంతో రాజకీయం వేడెక్కింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి TDP కండువా కప్పుకోలేదని, YCPకి చెందిన వారికి పార్టీ కండువాలు ఎలా కప్పుతారని MLA జయసూర్య నిన్న వ్యాఖ్యానించారు. దీనిపై TDP రాష్ట్ర నేత చిన్న వెంకటస్వామి స్పందిస్తూ.. ‘YCP నుంచి వచ్చిన మీరా బైరెడ్డి గురించి మాట్లాడేది. MP శబరి, బైరెడ్డి దయతో గెలిచిన నువ్వు గాలి MLAవు’ అంటూ ఫైర్ అయ్యారు.

News July 7, 2024

తమ తల్లి హత్య కేసును సీఐడీకి అప్పగించాలని డీజీపీకి వినతి

image

ఆళ్లగడ్డలోని పాతూరు వీధిలో టీడీపీ మహిళా కార్యకర్త అట్లా శ్రీదేవి(54) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును శ్రీదేవి కుమారుడు అట్లా హర్షవర్ధన్ రెడ్డి, కుమార్తె రమ్యశ్రీ కోరారు. ఈ మేరకు శనివారం విజయవాడలో డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించి విచారణ చేయించాలని కోరారు.

News July 7, 2024

ఈ నెల 8న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కర్నూలు కలెక్టర్

image

జులై 8వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం)కార్యక్రమం ద్వారా  వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలను ఏర్పాటు చేశామన్నారు.

News July 6, 2024

నంద్యాల చేరుకున్న నూతన కలెక్టర్

image

నంద్యాల జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారిణి బీ.రాజకుమారి శనివారం రాత్రి నంద్యాల చేరుకున్నారు. ప్రస్తుతం గుంటూరు JCగా ఉన్న ఆమె పదోన్నతిపై నంద్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నూతన జిల్లా కలెక్టర్‌ రాజకుమారికి డీఆర్వో పద్మజ, ఆర్డీవో మల్లికార్జున రెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్‌గా రాజకుమారి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

News July 6, 2024

CMల భేటీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

image

ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో భేటీలో రాష్ట్రం నుంచి నలుగురు మంత్రులకు అవకాశం దక్కగా.. అందులో బనగానపల్లె MLA, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి CM చంద్రబాబు వెంట పాల్గొన్నారు. దీంతో BCJRకి అరుదైన గౌరవం దక్కింది.

News July 6, 2024

గుడికంబాళి నుంచి ఇసుక రవాణా: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో ఈ నెల 8వ తేది నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. కౌతాళం మండలం గుడికంబాళి స్టాక్ పాయింట్ నుంచి ఇసుక రవాణాను ప్రారంభించాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News July 6, 2024

కర్నూలు: హెడ్ కానిస్టేబుల్ మృతి

image

మంత్రాలయం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేశ్ అనారోగ్యంతో మృతిచెందినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు. రమేశ్ 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారన్నారు. 1998 బ్యాచ్‌కు చెందిన రమేశ్.. గతంలో ఆదోని వన్ టౌన్ ట్రాఫిక్ స్టేషన్‌లో పనిచేసేవారని, ప్రస్తుతం మంత్రాలయంలో విధులు నిర్వహించారని తెలిపారు.

News July 6, 2024

కర్నూలు: రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

image

మంత్రాలయం రోడ్డు (తుంగభద్ర) రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పద్మ అనే మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే శాఖ ఎస్సై నరసింహ మూర్తి తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన పద్మకు కర్ణాటకలోని అడివి కానాపురానికి చెందిన వీరేశ్‌తో వివాహం జరిగింది. పద్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన కర్ణాటక ప్రాంతంలో జరిగడంతో అక్కడి పోలీసులే కేసు నమోదు చేశారన్నారు.