Kurnool

News July 5, 2024

కర్నూల్: ‘ఉపాధి’లో 78 మందికి షోకాజ్ నోటీసులు

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించిన 78 మంది ఉపాధి అధికారులు, సిబ్బందికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు, 10 మండలాల ఏపీవోలు, ఈసీలు, దాదాపు అన్ని మండలాల్లోని పలువురు సాంకేతిక సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

News July 5, 2024

డా.సుధాకర్‌పై పోక్సో కేసు నమోదు

image

బాలికపై లైంగిక వేధింపుల కేసులో కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్‌‌ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. నిందితుడిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 376తో పాటు బాధితురాలు మైనర్‌ కావడంతో పోక్సో చట్టం సెక్షన్‌ 6 రెడ్‌విత్‌ 5(ఎల్‌) కింద కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుధాకర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా కారాగారానికి తరలించారు.

News July 5, 2024

కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్

image

బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్‌‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మూడేళ్లుగా తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు నిన్న కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ప్రొహిబిషన్, ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఎం.సరోజనమ్మ 14 రోజుల రిమాండ్ విధించడంతో సుధాకర్‌ను జిల్లా కారాగారానికి తరలించారు.

News July 5, 2024

బడి బయట పిల్లలను గుర్తించండి: ఆర్జేడీ

image

ఇప్పటికీ బడికి వెళ్లకుండా బడి బయట ఉన్న పిల్లలను వెంటనే గుర్తించాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ రాఘవరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలుకు వచ్చిన ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గతేడాది కంటే పెంచాలని సూచించారు. విద్యా కానుక కిట్ల పంపిణీ 100% పూర్తి చేయాలన్నారు.

News July 4, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News July 4, 2024

ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత దుర్భాషలు: వైసీపీ

image

నంద్యాల జిల్లాలో ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత దుర్భాషలాడారని వైసీపీ విమర్శించింది. ‘కొలిమిగుండ్ల మండలంలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాల గదుల్లో పెట్టొద్దని టీచర్ చెప్పారు. దీంతో టీడీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయుడిపై నోటికి వచ్చినట్లు తిట్టాడు. తిట్లకు టీచర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గురువులను గౌరవించే విధానం ఇదేనా?’ అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టింది.

News July 4, 2024

కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన మంత్రి బీసీ

image

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఢిల్లీ వెళ్లిన ఆయన వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎంతో పాటు మంత్రి బీసీ కలిశారు. అనంతపురం-అమరావతి, హైదరాబాద్-అమరావతి హైవేలు, పెండింగ్‍ హైవేల నిర్మాణాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. పలు విషయాలపై వినతి పత్రం ఇచ్చినట్లు సమాచారం.

News July 4, 2024

కర్నూలు జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ప్రారంభం

image

నీట్, యూజీసీ నెట్ పరీక్షల పేపర్ల లీక్‌ను నిరసిస్తూ నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. గురువారం కర్నూలులోని ఇందిరా గాంధీ స్మారక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని విద్యార్థులను ఇంటికి పంపించారు. నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

News July 4, 2024

కర్నూలు: తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్లకు ఇంక్రిమెంట్ల తొలగింపు

image

కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం తహసీల్దార్ ఎం.మాధూరి, సబ్ రిజిస్ట్రార్ బీ.సాయి కృష్ణారెడ్డికి రెండు ఇంక్రిమెంట్లు తొలగించినట్లు లోకాయుక్త రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి బుధవారం తెలిపారు. వెబ్‌ల్యాండ్ దస్త్రాల్లో అవకతవకలు జరిగినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదించగా తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌కు రెండు ఇంక్రిమెంట్లు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిందన్నారు.

News July 4, 2024

కర్నూలు: నేటి నుంచి ‘స్కౌట్స్ అండ్ గైడ్స్’ దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు జిల్లాలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాత యూనిట్ల పునరుద్ధరణ, కొత్త యూనిట్ల నమోదుకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శామ్యూల్ తెలిపారు. 8వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు రిజస్ట్రేషన్ క్లడ్/బుల్బులకు రూ.211, స్కాట్స్ అండ్ గైడ్స్‌కు రూ.381, రివర్స్ అండ్ రేంజర్స్‌కు రూ.301 ప్రకారం ఫీజు చెల్లించి ప్రతి స్కూల్ యాజమాన్యం రసీదు పొందాలన్నారు.