Nellore

News May 19, 2024

రాయితీపై పంపిణీకి సిద్ధంగా విత్తనాలు

image

NLR: ఖరీఫ్ సీజన్‌లో భాగంగా బోర్ల కింద పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 4316 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ నెల్లూరు జేడీ సత్యవాణి తెలిపారు. కిలోకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మినుము, పెసర, కందుల విత్తనాలను కూడా 50 శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలూ అందుబాటులో ఉన్నాయన్నారు.

News May 19, 2024

వామ్మో.. ముంబై రోడ్డుపై ప్రయాణమా..!

image

నెల్లూరు-ముంబై రహదారి ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. బుచ్చిరెడ్డిపాళెం, సంగం, ఆత్మకూరు, మర్రిపాడు మండలాల పరిధిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలోనే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రమాదాలకు ఆగి ఉన్న వాహనాలే కారణమవుతున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా పరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News May 19, 2024

రిలాక్స్ మూడ్‌లో పొలిటికల్ వారసులు

image

నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల కుటుంబ సభ్యులు కీలకపాత్ర పోషించారు. భార్యలతో పాటు కుమారులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్లు ఎండను సైతం లెక్కచేయక ఇల్లిల్లూ తిరిగారు. పోలింగ్ ముగియడంతో వారిలో ఎక్కువ శాతం మంది రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. పలువురు విదేశాలకు వెళ్లగా మరికొందరు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

News May 19, 2024

గోనుపల్లికి పండగొచ్చింది..!

image

పెంచలకోన శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాపూరు మండలం గోనుపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. తమ ఇంటి అల్లుడైన నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల కోసం కోనకు బయలుదేరిన నేపథ్యంలో గోనుపల్లి గిరిజనులు సంప్రదాయ నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా కోన వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. కోన తిరునాళ్ల సందర్భంగా గోనుపల్లి గిరిజనులు తమ ఇళ్ల వద్ద పందిర్లు వేసి ముగ్గులు తీర్చిదిద్దారు.

News May 19, 2024

ఆనకట్టలో పురిటి బిడ్డ మృతదేహం

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. గుర్తుతెలియని వ్యక్తులు పురిటి బిడ్డ మృతదేహాన్ని మూటగట్టి ఆనకట్టలో పడేశారు. ఇవాళ ఉదయం అటువైపు వాకింగ్ వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆనకట్ట సమీపంలోనే పలు హాస్పిటల్స్ ఉన్నాయి. డెలివరీ సమయంలో బిడ్డ చనిపోవడంతో పడేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News May 19, 2024

ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తులు

image

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో అందుబాటులో ఉన్న వివిధ ట్రేడ్లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెంకటేశ్వరపురం బాలికల ఐటీఐ ప్రిన్సిపల్ రిజియ తెలిపారు. విద్యార్థులు జూన్ 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్లు తదితర వివరాల కోసం సమీపంలోని ఐటీఐ కాలేజీలను సంప్రదించాలని కోరారు.

News May 19, 2024

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పెట్రోల్ బంకు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వెళ్తున్న లారీని, కనిగిరి నుంచి వస్తున్న బస్సు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పది మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

News May 19, 2024

నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఇదే చర్చ

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈక్రమంలో జిల్లాలో ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారనే దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు స్థానికులకు ఫోన్ చేసి మీ దగ్గర ఎవరు గెలుస్తారని ఆరా తీస్తున్నారు. మరోవైపు నెల్లూరు సిటీలో మెజార్టీపై, కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

News May 19, 2024

కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి: వికాస్ మర్మత్

image

నెల్లూరులో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ ఎన్నికల అధికారులకు సూచించారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని ఆయన ఛాంబర్‌లో శనివారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు

News May 18, 2024

పెళ్లకూరు: కారు ఢీకొని వ్యక్తి మృతి

image

పెళ్లకూరు మండలం చెంబడిపాలెం 71వ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల్లూరులోని వేంకటేశ్వర భగత్ సింగ్ కాలనీకి చెందిన అలీ షేర్ రోడ్డు మీద నడిచి వెళుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొంది. ఘటనలో అలీ అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లకూరు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.