Andhra Pradesh

News June 19, 2024

మాజీ CM జగన్‌‌పై ఎస్పీకి ఫిర్యాదు

image

మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రూ.6.67 కోట్ల ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశాడన్నారు. విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ మలికా గర్గ్‌కి వినతిపత్రం అందజేశారు.

News June 19, 2024

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: ఎమ్మెల్యే జయసూర్య

image

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం అల్లూరు గ్రామం మాండ్ర శివానందరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. సబ్సిడీల ద్వారా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

News June 19, 2024

భూసేకరణపై దృష్టి సారించాలి: అనంతపురం జిల్లా కలెక్టర్

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులు, ఏపీఐఐసీ, సోలార్ ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్, ఎంఐజి లేఅవుట్, రైల్వే, సాంఘిక సంక్షేమ శాఖల భవనాలకు సంబంధించి భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. భూ కేటాయింపు ప్రక్రియపై పలు సూచనలు చేశారు.

News June 19, 2024

ప్రభుత్వ సేవలను విస్తృతం చేయాలి: అన్నమయ్య కలెక్టర్

image

ప్రభుత్వ శాఖలలో ప్రజలకు అందించే రోజువారి సేవలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటిలోని కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయ సేవలు, భూ సేకరణ, సివిల్ సప్లై తదితర అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.

News June 19, 2024

ప.గో: బ్యాక్‌లాగ్ అడ్మిషన్స్‌కు ప్రవేశ పరీక్ష

image

ప.గో జిల్లా నరసాపురం మండలంలో మహాత్మ జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాల (బాలికలు)లో 6 నుంచి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను రిజర్వేషన్ అనుసరించి ఈనెల 20వ తేదిన 6, 8 తరగతులకు, 21వ తేదిన 7, 9 తరగతులకు రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ Ch.K.శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు.

News June 19, 2024

మంత్రి స్వామిని కలిసిన ప్రకాశం కలెక్టర్

image

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామికి కలెక్టర్ పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.

News June 19, 2024

కాకినాడ: 20 నుంచి ITI విద్యార్థులకు ఇంటర్వ్యూలు

image

కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20వ తేదీన ఇటర్వ్యూలు ఉంటాయని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ వేణుగోపాల వర్మ మంగళవారం తెలిపారు. కాకినాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. 554 మందికి ఈ నెల 20 నుంచి 25వ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.

News June 19, 2024

SKLM: కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక: మంత్రి అచ్చెన్న

image

కష్టకాలంలో జండా మోసిన ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని మంత్రి అచ్చనాయుడు అన్నారు. కోటబొమ్మాలి పార్టీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం చేరుకున్న ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని వారి సేవలను పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రజల మంచి కోరే పనులు చేయాలని సూచించారు.

News June 19, 2024

మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం: కలెక్టర్

image

2027 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

News June 19, 2024

పాడేరు: నేడు సికిల్ సెల్‌ ఎనీమియాపై అవగాహన సదస్సు

image

సికిల్ సెల్ ఎనీమియా నివారణపై ఈనెల 19న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ తెలిపారు. పాడేరు తలారిసింగి ఇండోర్ స్టేడియంలో సదస్సు ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. 19న ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ కూడలి నుంచి ఇండోర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం డిల్లీ నుంచి పర్చువల్ విధానంలో సికిల్ సెల్ ఎనీమియాపై సదస్సు నిర్వహిస్తారన్నారు.