Andhra Pradesh

News June 11, 2024

తిరుపతిజిల్లా మంగళంలో యువకుడు హత్య

image

తిరుపతి అర్బన్ మండలం మంగళం పరిధిలో యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి సమీపంలోని బొమ్మల క్వార్టర్స్ లో కాలనీకి చెందిన నలుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్టు స్థానికులు చెప్పారు. కొంత సమయం తర్వాత మద్యం మత్తులో అన్నామలై అనే యువకుడిని మిగిలిన వ్యక్తులు గొంతు మీద కాలేసి తొక్కి చంపినట్టు పోలీసులు తెలిపారు.
హత్యకు పాల్పడినట్టు చెబుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News June 11, 2024

ఎన్డీఏ సమావేశంలో నెల్లూరు ఎమ్మెల్యేలు

image

విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఆత్మకూరు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. గత అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం, కోటంరెడ్డి ఇప్పుడు టీడీపీ సభ్యులుగా విజయం సాధించి సభలో అడుగుపెట్టబోతున్నారు.

News June 11, 2024

రామసముద్రం: సింగిల్ విండో అధ్యక్ష పదవికి కేశవరెడ్డి రాజీనామా

image

రామసముద్రం మండల సహకార బ్యాంకు అధ్యక్షులుగా ఉన్న కేశవరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సోమవారం రాజీనామా లేఖను ఉన్నతాధికారులకు పంపారు. కేశవరెడ్డి మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా సింగల్ విండో అధ్యక్షులుగా పని చేసిన తనకు సహకరించిన అధికారులకు, బోర్డు సభ్యులకు, రైతులకు, ప్రజలకు, పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

News June 11, 2024

ఇగ్లండ్‌లో పల్నాడు జిల్లా యువకుడి మృతి

image

ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్‌ వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన సాయిరాం (24) ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్‌ వెళ్లాడు. అయితే ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. అనంతరం మాంచెస్టర్ నుంచి పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 11, 2024

మాజీ ఎంపీ బెల్లాన ఇలాకాలో టీడీపీదే జోరు

image

విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్వగ్రామమైన చీపురుపల్లి మేజర్ పంచాయతీలో టీడీపీ ప్రభంజనం కనిపించింది. ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి 7,193 ఓట్లు పడగా… వైసీపీకి 4,988 ఓట్లు వచ్చాయి. చీపురుపల్లి మేజర్ పంచాయితీలో తెలుగుదేశం పార్టీకి 2,205 ఓట్ల భారీ ఆధిక్యత రావడం విశేషం. దాదాపు అన్ని వార్డుల్లోనూ టీడీపీ ఆధిక్యత కనబరిచింది.

News June 11, 2024

దగదర్తిలో విమానం దిగేనా ! 

image

దగదర్తిలో ఎయిర్ పోర్టు నిర్మాణం పదేళ్లుగా హామీగా మిగిలిపోయింది. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైసీపీ హయాంలోనూ పనులు చేపట్టలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం, ఆ పార్టీ ఎంపీ రాంమోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కావడంతో దగదర్తి ఎయిర్ పోర్టు కల సాకారం కావాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.

News June 11, 2024

మచిలీపట్నం వద్ద లారీ కిందపడి మహిళ మృతి

image

మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రేపల్లెకు చెందిన మోపిదేవి రాజేశ్వరి అనే మహిళ మృతి చెందింది. తన భర్త, కుమారుడితో కలిసి తాళ్లపాలెంలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయగా.. రాజేశ్వరి ప్రమాదవశాత్తు లారీ కింద పడింది. లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

News June 11, 2024

కృష్ణా: డిప్లొమా కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

భావదేవరపల్లిలోని ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. SSC పాసైన అభ్యర్థులు https://apfu.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 10 నుంచి 26లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఏ చంద్రశేఖరరావు తెలిపారు. అడ్మిషన్లకు ఎలాంటి ప్రవేశపరీక్ష నిర్వహించమని, పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడవచ్చని ఆయన స్పష్టం చేశారు.

News June 11, 2024

కర్నూలు: పడిదంపాడు వద్ద కేసీకి గండి

image

కర్నూలు మండల పరిధిలోని పడిదంపాడు వద్ద కేసీ కాలువకు గండి పడింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగి ఉద్ధృతంగా ప్రవహించడంతో కేసీ కాలువలోకి పెద్దఎత్తున నీరు చేరి కట్ట కొంతమేర తెగిపోయింది. నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. నీటి ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టిన వెంటనే మరమ్మతులు చేస్తామని కేసీసీ కర్నూలు డీఈఈ రఘురామిరెడ్డి, ఏఈ చిన్నరాజా తెలిపారు.

News June 11, 2024

కృష్ణా: చెన్నై వెళ్లే వాహనదారులకు ముఖ్య గమనిక

image

గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్నందున బుధవారం ట్రాఫిక్‌ మళ్లించనున్నామని పోలీసులు తెలిపారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే రవాణా వాహనాలు హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుమూడి వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు సైతం ఇదే మార్గంలో వెళ్లాలన్నారు.