Andhra Pradesh

News May 31, 2024

నెల్లూరు: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు

image

నెల్లూరు జిల్లాలో 3,14,422 మంది లబ్ధిదారులకు పింఛన్ కానుక అందజేయనున్నారు. 2,28,471 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జూన్ 5వ తేదీలోపు జమ చేస్తారు. దివ్యాంగులు, ఆరోగ్యం సక్రమంగా లేని 85,951 మంది లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది.

News May 31, 2024

చంద్రబాబుతో కిమిడి నాగార్జున భేటీ

image

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబును నాగార్జున గురువారం రాత్రి కలిసి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో జరిగిన ఎన్నికల సరళిని వివరించారు. జిల్లాలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News May 31, 2024

తూ.గో: ఇంటర్ పరీక్షలకు 6,639 మంది హాజరు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ విభాగంలో గురువారం పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరంలో 5,990 మందికి గాను 5,538 మంది.. ద్వితీయ సంవత్సరంలో 986 మందికి గాను 887 మంది.. వృత్తి విద్యా విభాగంలో 288 మందికి 214 మంది మొత్తం 6,639 మంది హాజరయ్యారని ఆర్‌ఐఓ నరసింహం తెలిపారు.

News May 31, 2024

కడప: డబ్బులు ఇవ్వకపోతే బెయిల్ రానివ్వను

image

ప్రొద్దుటూరులో రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో ఇటీవల గొడవ జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో ఓ వ్యక్తికి రిమాండ్‌కు పంపే క్రమంలో నిందితుడిని కానిస్టేబుల్ రూ.5 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.2 వేలు ఇస్తామన్నా వినలేదు. దీనికి సంబంధించిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో కానిస్టేబుల్‌పై ACBకి ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే కానిస్టేబుల్ పై పలు ఆరోపణలు వచ్చాయన్నారు.

News May 31, 2024

డోన్: 14 మంది మున్సిపల్ ఉద్యోగులపై కేసు నమోదు

image

టీడీపీ ప్రభుత్వ హయాంలో డోన్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అవినీతికి బాధ్యులైన 14 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణం, డీజిల్ కొనుగోలులో రూ.24 లక్షల అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. అందుకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

News May 31, 2024

నో ఫ్లై జోన్స్‌లో డ్రోన్స్ ఎగరొద్దు: ఎస్పీ హెచ్చరిక

image

ఆంక్షలు విధించిన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ప.గో SP అజిత వేజెండ్ల హెచ్చరించారు. పోలింగ్ తర్వాత SRKR, విష్ణు ఇంజినీరింగ్ కళాశాలల్లో EVMలు, వీవీప్యాట్స్ భద్రపర్చినందున ఆ ప్రాంతాల్లో డ్రోన్స్, బెలూన్స్, ఇతరత్రా ఎగురవేయరాదన్నారు. ఈ కళాశాలల పరిసర ప్రాంతాలను జూన్ 5 వరకు నో ఫ్లై జోన్స్‌గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్‌కు అందరూ సహకరించాలని కోరారు.

News May 31, 2024

అనంత: విద్యుత్ స్థంబాల ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు మృతి చెందారు. బీటీపీ గ్రామానికి చెందిన వీరేశ్ పరిస్థితి విషమించడంతో రాయదుర్గం ప్రభుత్వాసుపత్రి నుంచి బళ్లారి విమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతి చెందాడు. విద్యుత్ స్తంభాలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో స్థంబాలు మీదపడి తీవ్రగాయాలవడంతో మృతిచెందినట్లు సమాచారం.

News May 31, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే ట్రైన్ నంబర్ 12513 సికింద్రాబాద్- సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను జూన్ 1న రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ రైలు ప్రయాణించే మార్గంలో ట్రాక్ సస్పెన్షన్ కారణంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News May 31, 2024

తూ.గో: దొంగ నోట్ల చలామణి.. ఐదుగురి అరెస్ట్

image

దొంగ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురిని రాజమండ్రిలోని ప్రకాశంనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారని సీఐ సత్యనారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన నరసింహారావు, హేమ నాయక్, రాజమండ్రిలోని జాంపేటకు చెందిన రెహమాన్, అస్లిమ్, రావులపాడుకు చెందిన నరసింహమూర్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరు హైదరాబాద్‌లో రూ.2 లక్షల విలువ గల రూ.500 దొంగ నోట్లు కొనుగోలు చేసి చలామణి చేస్తూ దొరికారన్నారు.

News May 31, 2024

యువకుడి మోసం.. బాలిక ఆత్మహత్యాయత్నం

image

ప్రేమ పేరుతో మోసగించిన ఘటన పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో వెలుగు చూసింది. ఎస్ఐ ప్రతాప్ రెడ్డి వివరాల మేరకు.. దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లెకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించాడు. ‘కులాలు వేరు కావడంతో నా తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఏమైనా చేసుకో’ అని యువకుడు బాలికతో అన్నాడు. దీంతో ఆమె ఉరేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతోంది.