Andhra Pradesh

News May 30, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఠారెక్కిస్తున్న ఎండలు

image

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వేసవి ప్రభావంతో ఎండలు ఠారెక్కిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కాస్తున్న ఎండకు వృద్ధులు, చిన్నారులు, ప్రజలు ఉక్కపోతతో తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఎండ ప్రభావంతో జన సంచారం లేక ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి తాపానికి గురి కాకుండా మజ్జిగ, మంచి నీరు, కొబ్బరినీళ్లు విధిగా తీసుకోవాలని, పనులు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News May 30, 2024

కారంపూడిలో అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య

image

ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కారంపూడి మండలంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారంపూడి మండలం పెద కొదమగుండ్ల గ్రామంలో చికెన్ కొట్టు నడుపుతున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

వై.పాలెం: విధులు మరిచి తన్నుకున్న పోలీసులు

image

పోస్టల్ బ్యాలెట్ బాక్సుల వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు తమ విధులను మరిచారు. మంగళవారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఆ మత్తులో మాట మాట పెరిగి వాగ్వాదానికి దిగి కొట్టుకున్న సంఘటన వై.పాలెంలోని అర్వో కార్యాలయం వద్ద జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారి అక్కడికి చేరుకుని పరిశీలించి మద్యం పరీక్ష నిర్వహించి తాగినట్లు గుర్తించి విధుల నుంచి తొలగించారు.

News May 30, 2024

ఆరో రౌండ్‌తో తేలనున్న పొదలకూరు లెక్క

image

సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో పొదలకూరు మండలం హాట్ టాపిక్ గా మారింది. ఈ మండలమే విజేత ఖరారులో కీలకం కానుంది. పొదలకూరు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలున్నాయి. సూరాయపాళెంతో మొదలై బ్రాహ్మణపల్లి ఈవీఎంతో ఈ మండలం కౌంటింగ్ ముగుస్తుంది. ఐదు రౌండ్ల వరకు పూర్తిగా పొదలకూరు మండలానికి సంబంధించిన ఈవీఎంల కౌంటింగే జరుగుతుంది. ఆరో రౌండ్ కు కేవలం మూడు ఈవీఎంలు మిగులుతాయి.

News May 30, 2024

ధర్మవరంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సమీపంలోని ధర్మవరం చెరువు రెండవ మరువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం స్థానికులు సమాచారం అందించడంతో ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే ఆయన ఎవరు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

News May 30, 2024

బాపట్ల: భవనం పైనుంచి పడి బాలుడి మృతి

image

చుండూరు మండలం ఆలపాడుకు చెందిన చేబ్రోలు సురేంద్ర (15) ఈనెల 20న స్నేహితులతో ఆడుకుంటూ.. స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంపైకి ఎక్కాడని బంధువులు తెలిపారు. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద గచ్చు మీద పడిపోయాడన్నారు. ఈ ప్రమాదంలో సురేంద్ర తలకు తీవ్ర గాయమవ్వగా.. గుంటూరులోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News May 30, 2024

కర్నూలు : డిగ్రీ పరీక్షలకు 350 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలోని రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలకు బుధవారం 350 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాస్తూ డిబార్ అయినట్లు వీసీ ప్రకటించారు. నాలుగో సెమిస్టర్‌లో మొత్తం 3,709 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 3,359 మంది హాజరయ్యారని వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు.

News May 30, 2024

పుంగునూరు: తగ్గుతున్న టమాటా ధరలు

image

టమోటా ధరలు మూడు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. 15 కిలోల బాక్సు ధర సోమవారం రూ.600 పలికింది. అప్పటి నుంచి రోజుకు వంద చొప్పున తగ్గుతూ బుధవారం నాటికి రూ.350 అధిక ధర పలకగా.. మొత్తంగా రూ.300కు చేరింది. ప్రస్తుతం కోతల దశలో తోటలు ఉండడం, ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News May 30, 2024

నాగార్జున యూనివర్సిటీకి జాతీయ ర్యాంక్

image

ది వీక్- హన్సా రీసెర్చ్ – బెస్ట్ యూనివర్సిటీ సర్వే – 2024 ర్యాంకింగ్స్ మల్టీడిస్సిప్లినరీ యూనివర్సిటీ కేటగిరిలో, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 16వ ర్యాంకును, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కృషి వల్లే ఈ ర్యాంకు సాధ్యమైందని వీసీ రాజశేఖర్ పేర్కొన్నారు. ఇటువంటి ర్యాంకుల ద్వారా విశ్వవిద్యాలయ కీర్తి మరింత ఉన్నత స్థాయికి చేరుతుందన్నారు.

News May 30, 2024

కోనసీమ: రికార్డు స్థాయిలో ‘పనస’ విక్రయాలు

image

కోనసీమ జిల్లా అంటే గుర్తొచ్చేవి కొబ్బరి తోటలు. వీటి మధ్యే అంతర్ పంటగా వేసే ‘పనస’ సైతం మంచి దిగుబడితో లాభాలు తెచ్చిపెడుతోంది. అంబాజీపేట మార్కెట్‌కు రోజూ 500-700లకు పైగా పనసకాయలు వస్తుంటాయి. జిల్లా నుంచి HYD, ఇతర నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈఏడాది జిల్లాలో 79.36 ఎకరాల్లో సాగు కాగా.. ఇప్పటికే రూ.7 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం. 10-15 కాయలు కాసే చెట్టుకు ఈసారి 25 కాసినట్లు రైతులు చెబుతున్నారు.