Andhra Pradesh

News May 29, 2024

VZM: ఎమ్మెల్సీ రఘురాజు అనర్హతపై ఈనెల 31న విచారణ

image

ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై ఈనెల 31న విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన రఘురాజు వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని మండలి ఛైర్మన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం అనర్హతపై ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎన్నికల ముందు అతని భార్య టీడీపీలో చేరగా ఆయన మాత్రం వైసీపీలో ఉంటూ టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు విమర్శలున్నాయి.

News May 29, 2024

సారవకోట: గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

సారవకోట మండలం అన్నుపురం గ్రామానికి చెందిన యడ్ల పోలీసు(65) డాబా పై నుంచి జారిపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసు ఈ నెల 23న రాత్రి భోజనం చేసి డాబాపై నిద్రించాడు. మూత్ర విసర్జనకు కిందకు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కేజీహెచ్‌కు తరలించగా వైద్య సహాయం పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News May 29, 2024

ప్రకాశం జిల్లాలో వేడిగాలులు

image

ప్రకాశం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఆరు గంటలు దాటినా వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. పెరుగుతున్న వడగాడ్పుల తీవ్రత కారణంగా జనం బయటకు అడుగు పెట్టేందుకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. జిల్లాలోని 21 గ్రామాల్లో మంగళవారం 40 డిగ్రీలకు పైగా నమోదవ్వగా, మాలెపాడులో అత్యధికంగా 42.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News May 29, 2024

నెల్లూరు: 1వ తేదీ లోపే ఏజెంట్ల దరఖాస్తులు

image

ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఏజెంట్ల కోసం అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలని నెల్లూరు జిల్లా అధికారులు తెలిపారు. 4న ఉదయం 8 గంటల్లోపు ఏజెంట్ల మార్పునకు అవకాశం ఉందన్నారు. ఒక సారి ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించిన తర్వాత ప్రక్రియ పూర్తయిన తర్వాతే బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు.

News May 29, 2024

కర్నూలు: తుంగభద్రలో మొసలి కలకలం

image

నందవరం మండలం నాగలదిన్నె సమీపంలో తుంగభద్ర నదిలో మంగళవారం ఓ మొసలి కనిపించింది. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదిలో నీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద నీటిలో మొసలి కొట్టుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నాగలదిన్నె వంతెనపై వెళ్తున్న ప్రజలు నది మధ్యలో తిరుగుతున్న మొసలిని చూశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

News May 29, 2024

మైదుకూరు డీఎస్పీకి చార్జ్ మెమో

image

మైదుకూరు డీఎస్పీ టి.వెంకటేశులుకు పోలీసుశాఖ ఉన్నతాధికారులు మంగళవారం చార్జ్ మెమో జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున మైదుకూరు నియోజకవర్గం పరిధిలో చాపాడు మండలంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలపై మైదుకూరు డీఎస్పీ టి.వెంకటేశులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో చాపాడు ఎస్ఐపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశాలు ఇచ్చారు.

News May 29, 2024

యానాం: గేదెను ఢీకొట్టి యువకుడి మృత్యువాత

image

యానాం ఒబిలిస్క్‌ టవర్‌ వద్ద మంగళవారం బైకుపై వేగంగా వెళుతున్న యువకుడు కర్రి నూకరాజు(21) గేదెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుడికి వెళ్లడం కోసం ఆటోలో బయల్దేరిన నూకరాజు కుటుంబం రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న తమ కుమారుడిని చూసి యానాం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా వైద్యులు వెంటనే కాకినాడకు తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 29, 2024

అనంత: జూన్ 2న తైక్వాండో జట్ల ఎంపికలు

image

అనంతపురంలోని రాంనగర్ చిన్నా బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జూన్ 2న ఉదయం 10 గంటలకు జిల్లా తైక్వాండో జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కె. శాంతరాజ్ తెలిపారు. ఏపీ తైక్వాండో సంఘం నుంచి రెడ్వన్ బెల్ట్ గ్రేడింగ్ కలిగి 15-17 ఏళ్ల వయసున్న బాలబాలికలు పాల్గొనడానికి అర్హులన్నారు. ఎంపికైన వారు వచ్చే నెలలో విజయనగరంలో జరగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

News May 29, 2024

తిరువూరు: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

image

ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వర్షిత(24)కు ఫిబ్రవరి 14న తిరువూరు మం. ఎరుకపాడుకు చెందిన గోపితో పెళ్లైంది. అనంతరం ఉన్నత చదువుల కోసం గోపి అమెరికా వెళ్లారు. వర్షితకు ఆరోగ్యం బాలేదని తల్లిదండ్రులు HYD నుంచి సొంతూరుకి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న ఆమె తెల్లారేసరికి బావిలో శవమై కనిపించింది. అనారోగ్య సమస్యలతోనే వర్షిత సూసైడ్ చేసుకుందని తండ్రి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 29, 2024

నెల్లూరు: రౌండ్ల వారిగా నియోజకవర్గ ఫలితాలు

image

కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఫలితాలు 20 రౌండ్లు, కావలి 23, ఆత్మకూరు 20, కోవూరు 24, నెల్లూరు నగరం 18, నెల్లూరు గ్రామీణం 21, ఉదయగిరి 24, సర్వేపల్లి 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 14టేబుళ్లు ఏర్పాటు చేయగా.. 4 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడించేందుకు మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు.